Nara Lokesh: అక్రమ కేసులతో మా నేతలను వేధిస్తున్నారు: నారా లోకేశ్

  • జగన్ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ కార్యదర్శి మండిపాటు
  • కడప జైలులో ప్రవీణ్ రెడ్డిని కలిసిన లోకేశ్ 
  • బాధితులపైనే కేసులు పెడుతోందని ప్రభుత్వంపై విమర్శ
  • కేసులకు భయపడే సమస్యేలేదని స్పష్టీకరణ  
Nara lokesh fires on andhrapradesh governament

తెలుగుదేశం పార్టీ నేతలపైన అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. కడప జిల్లా జైలులో ఉన్న పార్టీ నేత ప్రవీణ్ రెడ్డిని ఆయన నేడు కలిశారు. తర్వాత బయట విలేకరులతో లోకేశ్ మాట్లాడారు. అక్రమ అరెస్టులకు టీడీపీ నేతలు భయపడబోరని ఆయన తేల్చి చెప్పారు. 

బయటకు వచ్చాక ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత తీవ్రం చేస్తానని ప్రవీణ్ రెడ్డి తనకు చెప్పాడన్నారు. పులివెందులలో నాగమ్మ అనే దళిత మహిళను దారుణంగా అత్యాచారం చేసి చంపేశారని లోకేశ్ గుర్తుచేశారు. ఈ విషయంలో బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలనూ కేసుల పేరుతో ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు, తెలుగు మహిళ అధ్యక్షురాలు అనితపైనా కేసులు పెట్టారని అన్నారు. వాళ్లు కూడా దళితులే అయినప్పటికీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయించారంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత భయపడిపోతోందో అర్థమవుతోందన్నారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డిని ప్యాలెస్ పిల్లీ అంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు. ప్యాలస్ పిల్లికి టీడీపీ నేతలను చూసినా, కార్యకర్తలు ఓ ట్వీట్ పెట్టినా వణుకు పుడుతుందన్నారు. అందుకే అక్రమ కేసులు పెట్టి టీడీపీ నేతలను జైలుకు పంపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసులు జగన్ పీనల్ కోడ్ అమలు చేస్తున్నారని, బాధితులపైనే కేసులు పెడుతున్నారని చెప్పారు. అదే జగన్ రెడ్డి రివర్స్ పోలీసింగ్ ప్రత్యేకత అని అన్నారు. 2013 లో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి చెందిన 60 మంది నాయకులు, 5 వేల మంది కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు. 70 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తల్ని హత్య చేశారని లోకేశ్ చెప్పారు.

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అసెంబ్లీలో పోరాడుతున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడుపై అక్రమ కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. వైఎస్ వివేకానంద కుటుంబానికి న్యాయం దక్కాలంటే వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసినందుకు బీటెక్ రవిపై కేసులు పెట్టారని చెప్పారు. అంతర్జాతీయ ఉగ్రవాదిలా ట్రీట్ చేస్తూ ప్రయాణం మధ్యలో ఎయిర్ పోర్ట్ రన్ వే పైన అరెస్టు చేశారని గుర్తుచేశారు. 

టీడీపీ ప్రొద్దుటూరు ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి చేసిన తప్పేంటని ప్రభుత్వాన్ని లోకేశ్ నిలదీశారు. ప్రవీణ్ ను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కడప స్టీల్ కోసం పోరాటం చేసిన ప్రవీణ్ రెడ్డి ఇంటిపై వైసీపీ గుండాలు దాడి చేశారని వివరించారు. అయితే, పోలీసులు మాత్రం ప్రవీణ్ రెడ్డిని అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. ప్రవీణ్ రెడ్డిపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రొద్దుటూరు కేంద్రంగా నడుస్తున్న బెట్టింగ్ మాఫియాకు స్వయంగా అక్కడి ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి డాన్ అని నారా లోకేశ్ ఆరోపించారు. ఆయన పేరు రాచమల్లు బెట్టింగ్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. బెట్టింగ్ దందా నిర్వాహకుల నుంచి ఆయనకు వాటా అందుతుందని ఆరోపించారు. దందాలు, సెటిల్ మెంట్లు చేయడానికి ఏకంగా పోలీసులనే వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్య కేసులో ఎమ్మెల్యే బావమరిది ప్రమేయం ఉందని ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. భయమనేది తమ బయోడేటాలోనే లేదని లోకేశ్ తేల్చిచెప్పారు. తమపై ఎన్ని కేసులు కావాలంటే అన్నీ పెట్టుకొమ్మని ప్రభుత్వానికి ఆయన సవాల్ చేశారు.

More Telugu News