Earth: భూమి గుండ్రంగా లేదట... సరికొత్త అధ్యయనంలో ఆసక్తికర అంశాలు

  • నేచుర్ కమ్యూనికేషన్స్ జర్నల్ లో ప్రచురణ
  • భూమి దీర్ఘవృత్తాకారంలో ఉందని వెల్లడి
  • గురుత్వాకర్షణ శక్తే అందుకు కారణమని వివరణ
Is earth shape ellipsoid

భూమి గుండ్రంగా ఉంటుందని పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాం. అంతకుముందు, భూమి బల్లపరుపుగా ఉండేదన్న వాదనలను, భూమి గుండ్రంగా ఉంటుందన్న సిద్ధాంతాలు కొట్టిపారేశాయి. 

అయితే, ఇప్పుడు భూమి గుండ్రంగా లేదంటూ సరికొత్త అధ్యయనం తెరపైకి వచ్చింది. భూమి దీర్ఘవృత్తాకారంలో ఉందని పరిశోధకులు చెబుతున్నారు. గురుత్వాకర్షణ శక్తి ఇప్పటికీ భూమి ఆకృతిని తీర్చిదిద్దుతోందని వివరించారు. మనం భూమిపై నిలబడగలుతున్నామంటే అందుకు కారణం గురుత్వాకర్షణ శక్తి అని తెలిసిందే. 

గురుత్వాకర్షణ శక్తి ప్రభావం భూమి ఆకారంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో పేర్కొన్నారు. ఈ అధ్యయనం నేచుర్ కమ్యూనికేషన్స్ అనే సైన్స్ జర్నల్ లో ప్రచురితమైంది. 

భూమి కేంద్రకం నుంచి ధ్రువాల వరకు ఉన్న దూరంతో పోల్చితే భూమి కేంద్రకం నుంచి భూమధ్యరేఖ వద్ద ఉపరితలం వరకు ఉన్న దూరం చాలా ఎక్కువని, భూమి దీర్ఘవృత్తాకారంలో ఉందనడానికి ఇదే నిదర్శనమని పరిశోధకులు చెబుతున్నారు. 

భూమి లోపల సుదూర లోతుల్లోని గురుత్వాకర్షణ శక్తులు పరిణామ క్రమంలో భూమిని ఎలా మలిచాయో పరిశోధకులు ఇప్పుడు కనుగొన్నారు. పర్వత శ్రేణుల కింద ఎంతో లోతుగా ఉండే ఈ శక్తులు ఆయా ప్రాంతాల్లో ఉండే లోపాలను ప్రేరేపించి, అనూహ్య కదలికలతో పర్వత శ్రేణులు కూలిపోవడానికి కారణమవుతాయని, దాంతో భూమిలోపల 30 కిలోమీటర్ల లోతున ఉండే శిలలు బయల్పడానికి దారితీస్తాయని పరిశోధకులు తెలుసుకున్నారు. అందుకోసం వారు అమెరికా పశ్చిమ భాగంలోని ఫీనిక్స్, లాస్ వేగాస్ ప్రాంతాల్లోని పూర్వ పర్వతశ్రేణుల్లో పరిశోధనలు చేపట్టారు. 

గురుత్వాకర్షణ శక్తి ఒక్కటే కాదని, సమతలంగా లేని భూమి ఉపరితలం, భూమి లోపల వనరుల విభజన వైరుధ్యాలు, భూమి పొరలైన క్రస్ట్, మాంటిల్ అస్తవ్యస్తంగా ఉండడం వంటి కారణాలు కూడా భూమి ఆకారాన్ని ప్రభావితం చేసినట్టు తాజా అధ్యయనంలో పేర్కొన్నారు.

More Telugu News