Pawan Kalyan: అర్ధరాత్రి నుంచి వేకువజాము వరకు హోటల్లో ఒక ఫ్లోర్ మొత్తం గందరగోళం సృష్టించారు: పవన్ కల్యాణ్

  • మంగళగిరిలో పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్
  • విశాఖ ఘటనలను వివరించిన జనసేనాని
  • జనసేన పోలీసులతో యుద్ధం చేయడలేదని స్పష్టీకరణ
  • వైసీపీ నుంచి ఏపీకి విముక్తి కలిగించడమే తమ ఉద్దేశమని వెల్లడి
Pawan Kalyan explains what happened in Vizag Novotel Hotel

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నంలో చోటుచేసుకున్న ఘటనలపై నేడు మంగళగిరిలో మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ నేతల భూకబ్జాలు బయటపడతాయనే తమ జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. విశాఖలో పోలీసులు తన పట్ల వ్యవహరించిన తీరుపైనా పవన్ స్పందించారు. తాము డ్యూటీ చేస్తున్నామని పోలీసులు చెప్పారని, అందుకు తనకేమీ అభ్యంతరంలేదని చెప్పానని, జనసేన చేస్తున్నది పోలీసులతో యుద్ధం కాదని స్పష్టం చేశానని వివరించారు. 

ఒత్తిళ్లు, బదిలీలు, వ్యక్తిగత కారణాలు ఉండొచ్చని, కానీ మా రాజ్యాంగపరమైన హక్కులను కాదంటున్నారని అడిగితే పోలీసుల నుంచి జవాబు లేదని తెలిపారు. తన తండ్రి కానిస్టేబుల్ గా ఉద్యోగం ప్రారంభించారని, పోలీసు వ్యవస్థపై తనకు గౌరవం ఉందని వెల్లడించారు. కాగా, తాను వస్తున్నానని విశాఖను పోలీస్ మయం చేశారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.

"విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల నుంచి బెటాలియన్లను దించేశారు. ఎక్కడ చూసినా పోలీసులే కనిపించారు. వేలాది మంది పోలీసులతో విశాఖను నింపాల్సిన అవసరం ఏముంది? మేం సంఘవిద్రోహశక్తుల్లా కనిపిస్తున్నామా? దీనిపై పోలీసు అధికారులను అడిగితే మమ్మల్ని అర్థం చేసుకోండి అంటారు... దాంతో ఫైనల్ గా వాళ్లకు ఒకటే చెప్పాను. ఇది మేం రాజకీయంగా చేయాల్సిన యుద్ధం. మీరు బైండోవర్ కేసులు పెట్టినా మేం సిద్ధమే. కావాలంటే నన్ను కూడా కొట్టండి, నా రక్తం కూడా చిందించండి అని చెప్పాను. 

ఇక నేను బస చేసిన హోటల్ లో అర్ధరాత్రి నుంచి వేకువజామున నాలుగున్నర, ఐదు గంటల వరకు ఒక ఫ్లోర్ మొత్తం గందరగోళం సృష్టించారు. అరుపులు, కేకలు, బాదడాలు, చప్పుళ్లతో భయానక వాతావరణం సృష్టించారు. పాపం, విదేశాల నుంచి వచ్చినవారు కూడా నోవోటెల్ హోటల్ లో ఉన్నారు. టూరిజం పరంగా ఎంత తప్పుడు సంకేతాలు వెళతాయి? వైసీపీ ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటు. 

గదిలో ఉన్న ఫ్యామిలీలను కూడా తనిఖీలు చేశారు. చిన్న పిల్లలు పడుకుని ఉన్నారని చెప్పినా వినిపించుకోకుండా, చూడాల్సిందేనంటూ సోదాలు జరిపారు. మీరు ఎవరిని సంతృప్తి పరచడానికి ఇలా చేస్తున్నారు సార్? అని పోలీసులను అడిగాను. దాంతో మళ్లీ మౌనం! వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. మేం దీన్ని రాజకీయపరంగా ఎదుర్కొనాల్సిందే అని వారికి చెప్పాను. 

వైసీపీ నుంచి ఏపీకి విముక్తి కలిగించడం ఒక్కటే మార్గం. లేకపోతే అభివృద్ధి జరగదు, భవిష్యత్ తరాలకు ఇది ఏమాత్రం మంచిది కాదు" అని పవన్ కల్యాణ్ వివరించారు.

More Telugu News