YSRCP: అంతా కలిసి రండి...వైసీపీ ఈజ్ వెయిటింగ్: పవన్ కు పేర్ని నాని కౌంటర్

  • విశాఖ పర్యటనపై మంగళగిరిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పవన్
  • పవన్ వ్యాఖ్యలను ఖండించేందుకు తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మీడియా ముందుకు వచ్చిన నాని
  • దళిత మంత్రిపై చెప్పులేస్తారా? అని నిలదీత
  • మహిళా మంత్రులపై అసభ్య పదజాలాన్ని వినియోగిస్తారా? అని ఆగ్రహం
  • మాట మార్చే వారికి పవన్ ఐకాన్ అని ఎద్దేవా
ex minister perni nani hits back pawan comments on ysrcp

విశాఖ పర్యటనలో భాగంగా తనను అడ్డుకున్న తీరును ప్రశ్నిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 'జనసేన ఈజ్ వెయిటింగ్' అంటూ అధికార వైసీపీకి హెచ్చరికలు జారీ చేశారు. ఆ మరుక్షణమే జనసేనకు వైసీపీ నుంచి అంతే స్థాయిలో వార్నింగ్ వచ్చింది. టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్టులతో కలిసి రండి... వైసీపీ ఈజ్ వెయిటింగ్ అంటూ వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని బదులిచ్చారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేనాని పవన్ తీరును ప్రశ్నిస్తూ పేర్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

మాట మార్చడంలో పవన్ కల్యాణ్ ను మించిన వారు లేరన్న పేర్ని... మాట మార్చే వారికి ఐకాన్ గా పవన్ నిలిచారని ఎద్దేవా చేశారు. 2014లో టీడీపీకి ఓటేయాలన్న పవన్... 2019లో టీడీపీకి ఓటేయవద్దని చెప్పారని గుర్తు చేశారు. 2014లో బీజేపీకి ఓటేయాలన్న పవన్... 2019లో బీజేపీకి ఓటేయవద్దని చెప్పారని కూడా ఆయన గుర్తు చేశారు. రాజధాని అమరావతిపైనా మాట మార్చడం పవన్ కు మాత్రమే చెల్లిందని ఆయన విమర్శించారు. పవన్ మాటలకు నీటి మీద రాతలకు ఏమాత్రం తేడా లేదని కూడా నాని ఆరోపించారు.  

విశాఖ ఎయిర్ పోర్టులో ఇద్దరు మహిళా మంత్రులు, ఇద్దరు బలహీన వర్గాలకు చెందిన మంత్రులు, ఓ దళిత మంత్రిపై దాడికి దిగిన తన పార్టీ కార్యకర్తలను మందలించాల్సిన పవన్... వారిని వెనకేసుకు రావడం ఏమిటని నాని ప్రశ్నించారు. దళిత మంత్రిపై చెప్పులేయిస్తారా? మహిళా మంత్రులను అసభ్య పదజాలంతో తిట్టిస్తారా? అని ఆయన నిలదీశారు. అయినా పవన్ కు స్వాగతం చెప్పేందుకు జెండా కర్రలతో రావాల్సిన జనసేన కార్యకర్తలు...దాడులు చేసే కర్రలకు జెండాలు కట్టుకుని ఎలా వచ్చారని ప్రశ్నించారు. మంత్రులపై దాడులు చేస్తుంటే... పోలీసులు చేతులు కట్టుకుని కూర్చోరని కూడా ఆయన అన్నారు. పోలీసులు వారి విధులను వారు నిర్వహిస్తారని నాని స్పష్టం చేశారు.   

తనపై ఎవరైనా విమర్శలు చేస్తే సహించలేని పవన్ కల్యాణ్.. తాను మాత్రం ఇతరులపై ఏ మాటలైనా మాట్లాడవచ్చా? అని నాని ప్రశ్నించారు. తనపై వ్యతిరేక కథనాలు రాశారని పలు పత్రికలు, టీవీ ఛానెళ్లను నిషేధిస్తున్నానని చెప్పిన పవన్... ఇప్పుడు అవే పత్రికలు, టీవీ ఛానెళ్లు తనకు అండగా నిలవాలని ఎలా కోరతారని నిలదీశారు. తాను విధానపరమైన విమర్శలు చేస్తానని చెప్పిన పవన్ వ్యాఖ్యలను ప్రస్తావించిన నాని... తనతో పాటు పలువురు వైసీపీ నేతలపై పలు సందర్భాల్లో పవన్ చేసిన విమర్శలను గుర్తు చేశారు. ఇవన్నీ విధానపరమైన విమర్శలా?... లేదంటే వ్యక్తిగతమైన విమర్శలా? అని ఆయన పవన్ ను నిలదీశారు.

More Telugu News