Kamikaze Drones: కమికాజే డ్రోన్లతో ఉక్రెయిన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రష్యా

  • కీవ్ నగరంపై కమికాజే డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా
  • వారం వ్యవధిలో రెండోసారి కమికాజే డ్రోన్లతో దాడులు
  • నేరుగా వెళ్లి లక్ష్యంపై పడిపోయే డ్రోన్లు
  • వీటితో తీవ్ర విధ్వంసం
  • అందుకోసం ఇరాన్ తయారీ డ్రోన్లు వాడుతున్న రష్యా
Russia uses Kamikaze drones to hit Kyiv

ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యా ప్రమాదకర ఆయుధాలను రంగంలోకి దించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను కమికాజే డ్రోన్లతో ముట్టడిస్తోంది. ఈ డ్రోన్ల ధాటికి కీవ్ నగరంలోని పలు పౌర, వాణిజ్య సముదాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఉదయం రష్యా సైన్యం కమికాజే డ్రోన్లతో కీవ్ పై విరుచుకుపడింది. ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. వారం రోజుల వ్యవధిలో రష్యా కమికాజే డ్రోన్లను ప్రయోగించడం ఇది రెండోసారి. 

'కమికాజే' అనే పదానికి రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంతో సంబంధం ఉంది. అప్పట్లో జపాన్ యుద్ధ విమానాల పైలెట్లు తమ విమానాల నిండా పేలుడు పదార్థాలు నింపుకుని నేరుగా వెళ్లి ప్రత్యర్థి స్థావరాలపై విమానాలను క్రాష్ ల్యాండింగ్ చేసేవారు. దాంతో ఆ స్థావరాలు పేలిపోయి తీవ్రనష్టం వాటిల్లేది. అటు, జపనీస్ పైలెట్లు కూడా చనిపోయారు. ఇది ఆత్మాహుతి దాడి వంటిదే. ఈ దాడినే జపనీస్ భాషలో 'కమికాజే' అంటారు. 

ఇప్పుడీ కమికాజే డ్రోన్లు కూడా శత్రుస్థావరాలపై పడి నాశనం చేస్తాయి, తాము కూడా పేలిపోతాయి. కాసేపు శత్రు స్థావరం చుట్టూ తిరిగి, ఒక్కసారి తమ లక్ష్యాన్ని నిర్ధారించుకున్నాక నేరుగా వచ్చి వాటిపై కూలిపోతాయి. దాంతో అక్కడ పెను విధ్వంసం చోటుచేసుకుంటుంది. 

కమికాజే డ్రోన్లు చాలా నిదానంగా ప్రయాణిస్తాయి. అయితే వాటిలోని పేలుడు పదార్థాలతో ఓ క్షిపణితో సమానంగా విధ్వంసం సృష్టించవచ్చు. అందుకే ఇప్పుడు రష్యా బలగాలు ఉక్రెయిన్ పై దాడుల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తున్నాయి. 

ఈ కమికాజే తరహా దాడుల కోసం రష్యా... ఇరాన్ తయారీ షాహెద్ డ్రోన్లను వినియోగిస్తోందని ఉక్రెయిన్ సైన్యం చెబుతోంది. ఇవి 1980 నుంచే వాడకంలో ఉన్నా, వీటిలో జీపీఎస్ సాంకేతికతను పొందుపరిచాక శత్రుభీకరంగా మారాయి. 

ఇవి నిదానంగా ప్రయాణించడం వల్ల రాడార్లకు వీటిని గుర్తించడం చాలా కష్టమవుతుంది. ఒకవేళ దీన్ని కూల్చేసినా సరే దీంట్లోని పదునైన వస్తువులు పౌరులను గాయపరుస్తాయి.

More Telugu News