Team India: చివరి ఓవర్లో 4 బంతుల్లో 4 వికెట్లు... షమీ మాయాజాలం.. ఆసీస్​కు భారత్ షాక్

  • వార్మప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై 6 పరుగులతో భారత్ ఉత్కంఠ విజయం
  • చివరి ఓవర్ నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్
  • ఓటమి ఖాయం అనుకున్న దశలో అద్భుతం చేసిన భారత్
Shami brilliance takes Indians to unlikely win over Australians

టీ20 ప్రపంచకప్ ముంగిట భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన తొలి వార్మప్ మ్యాచ్ లో  ఆరు పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. గాయపడ్డ జస్ ప్రీత్ బుమ్రా స్థానంలో చివరి నిమిషంలో భారత జట్టులోకి వచ్చిన సీనియర్ పేసర్ మహ్మద్ షమీ (3/4) నిప్పులు చెరిగే బౌలింగ్ తో ఆతిథ్య జట్టును కంగారు పెట్టాడు. చివరి ఓవర్లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పతనం కాగా, అందులో మూడు వికెట్లు షమీ ఖాతాలోకి చేరాయి. ఆ ఓవర్లో ఓ రనౌట్ కూడా ఉంది.  మొత్తమ్మీద అద్భుతంగా బౌలింగ్ చేసి షమీ భారత్ ను గెలిపించాడు. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (57), సూర్యకుమార్ యాదవ్ (50) అర్ధ సెంచరీలు సాధించారు. రోహిత్ శర్మ (15), విరాట్ కోహ్లీ (19), హార్దిక్ (2) నిరాశ పరిచారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (76) మెరుపు వేగంతో బ్యాటింగ్ చేయడంతో ఆతిథ్య జట్టు 18 ఓవర్లలో 171/4 స్కోరుతో నిలిచి సులువుగా గెలిచేలా కనిపించింది. చేతిలో ఆరు వికెట్లు ఉండగా చివరి రెండు ఓవర్లలో ఆ జట్టుకు 16 పరుగులు మాత్రమే అవసరం అయ్యాయి. 

అయితే, 19వ ఓవర్ తొలి బంతికే ఫించ్ ను క్లీన్ బౌల్డ్ చేసిన హర్షల్ పటేల్ భారత్ ను రేసులోకి తెచ్చాడు. తర్వాతి బంతికి టిమ్ డేవిడ్ (5)ను కోహ్లీ రనౌట్ చేశాడు. ఆ ఓవర్లో ఐదు పరుగులే రాగా.. ఆఖరి ఓవర్లో ఆసీస్ కు 11 పరుగులు కావాల్సి వచ్చింది. షమీ వేసిన ఈ ఓవర్లో తొలి రెండు బంతులకు కమిన్స్ రెండు డబుల్స్ తో నాలుగు పరుగులు రాబట్టాడు. ఆఖరి నాలుగు బాల్స్ లో ఆసీస్ కు 7 రన్స్ అవసరం అవగా.. తీవ్ర ఉత్కంఠ మొదలైంది. ఈ దశలో షమీ మాయాజాలం చేశాడు. మూడో బాల్ కు కమిన్స్ ను అతను ఔట్ చేయగా.. నాలుగో బంతికి అగర్(0) రనౌటయ్యాడు. తర్వాతి రెండు బంతుల్లో ఇంగ్లిస్ (1), కేన్ రిచర్డ్ సన్ (0) లను షమీ క్లీన్ బౌల్డ్ చేయడంతో భారత్ గెలిచింది.

More Telugu News