gratuty: గ్రాట్యూటి నిబంధనలలో త్వరలో మార్పులు: కేంద్ర ప్రభుత్వం

  • కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏడాదికే చెల్లింపు
  • కొత్త కార్మిక చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన
  • ప్రస్తుతం ఐదేళ్ల సర్వీసు తర్వాత అందుకుంటున్న ఉద్యోగులు
Gratuity After One Year of Service For Contract Workers

ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు గ్రాట్యూటీ అర్హత కాలాన్ని కుదించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కాంట్రాక్టు ఉద్యోగులు ఏడాది సర్వీసు పూర్తిచేసుకోగానే గ్రాట్యూటీ అందుకునేలా త్వరలో మార్పులు చేయబోతోంది. ఈమేరకు 29 కేంద్ర కార్మిక చట్టాలను మదింపుచేసి కేంద్రం నాలుగు కొత్త లేబర్ కోడ్స్ ను రూపొందించింది. వీటిలో గ్రాట్యూటీ నిబంధనలకు మార్పులను ప్రతిపాదించింది. అయితే, ఈ కొత్త లేబర్ కోడ్స్ కు రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలపాల్సి ఉంది. 

ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల (పేమెంట్ ఆఫ్ గ్రాట్యూటీ యాక్ట్ 19 72) ప్రకారం.. ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న తర్వాతే ఉద్యోగికి గ్రాట్యూటీ పొందేందుకు అర్హత లభిస్తుంది. ఈ నిబంధనలో మార్పులు చేసి ప్రైవేటు కంపెనీలలోని కాంట్రాక్టు ఉద్యోగులు ఏడాది సర్వీసు పూర్తిచేసుకున్న తర్వాత గ్రాట్యూటీ అందుకునేలా చేయాలని కేంద్రం నిర్ణయించింది. అయితే, ప్రైవేటు కంపెనీలో శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ మార్పులు వర్తించవు. వారికి ఐదేళ్ల సర్వీసు తర్వాతే గ్రాట్యూటీ పొందే అర్హత లభిస్తుంది.

కొత్త లేబర్ కోడ్స్ ప్రకారం.. గ్రాట్యూటీ లెక్కింపును కూడా కొత్త మార్గదర్శకాల ప్రకారం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం బేసిక్ పే, డీఏల ఆధారంగా గ్రాట్యూటీ లెక్కిస్తున్నారు. ఏడాది సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగికి గత నెల అందుకున్న జీతంలో 15 రోజుల బేసిక్ పే, డీఏలను గ్రాట్యూటీకి జమచేస్తున్నారు. ఉద్యోగి మొత్తం జీతంలో సగ భాగాన్ని బేసిక్ పే కింద చూపాలని కేంద్రం ప్రతిపాదించింది. దీనివల్ల ఉద్యోగుల గ్రాట్యూటీ మొత్తం పెరుగుతుంది.

More Telugu News