KA Paul: బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి మద్దతు కోరిన కేఏ పాల్.. మునుగోడును అమెరికా చేస్తానని వ్యాఖ్య!

  • మునుగోడు ఉప ఎన్నికలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కేఏ పాల్
  • ప్రచారం సందర్భంగా ఎదురుపడ్డ కోమటిరెడ్డి, కేఏ పాల్
  • కోమటిరెడ్డిని ఆప్యాయంగా హత్తుకున్న కేఏ పాల్
KA Paul seeks Komatireddy Rajgopal Reddy support in Munugode by polls

మునుగోడు ఉప ఎన్నిక బరిలోకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దిగిన సంగతి తెలిసిందే. ప్రజాశాంతి పార్టీ తరపున ఆయన వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో, ఇండిపెండెంట్ అభ్యర్థిగా వేసిన నామినేషన్ తో ఆయన ఎన్నిక బరిలో నిలిచారు. ప్రచారపర్వంలో ఆయన దూసుకుపోతున్నారు. 

ప్రచారంలో భాగంగా నిన్న ఆయన చండూరుకు వచ్చారు. ఇదే సమయంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అక్కడ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కోమటిరెడ్డిని చూసిన వెంటనే ఆయన వద్దకు వచ్చిన కేఏ పాల్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డికి ఆయన ఆసక్తికర విన్నపం చేశారు. ఉప ఎన్నికలో తనకు మద్దతును ఇవ్వాలని కోరారు. తనను గెలిపిస్తే 60 నెలల్లో ఎవరూ చేయలేనంత అభివృద్ధిని చేసి చూపిస్తానని చెప్పారు. మునుగోడును మరో అమెరికా చేస్తానని తెలిపారు. 

మరోవైపు కేఏ పాల్ ను చూసిన వెంటనే బీజేపీ కార్యకర్తలు జై బీజేపీ అంటూ నినాదాలు చేశారు. కేఏ పాల్ కూడా బీజేపీ శ్రేణులతో కలిసి కాసేపు నడిచారు. ఈ సందర్భంగా మీడియాతో కేఏ పాల్ మాట్లాడుతూ... తనకు మద్దతును ఇవ్వాలని తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని కోరానని చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఓట్లను కొనుక్కుంటున్నాయని ఆరోపించారు. ఒకప్పుడు అడవిగా ఉన్న హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేశానని చెప్పారు. తనను గెలిపిస్తే మునుగోడును మరో అమెరికా చేస్తానని అన్నారు. ఆరు నెలల్లో 7 వేల మందికి ఉద్యోగాలను కల్పిస్తానని చెప్పారు.

More Telugu News