Rishi Sunak: సంక్షోభంలో లిజ్ ట్రస్.... రిషి సునాక్ బ్రిటన్ పీఎం పదవిని చేపడతాడంటూ జోరుగా బెట్టింగులు

  • ఇటీవలే బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్
  • సొంతపార్టీలోనే వ్యతిరేకత
  • ఇటీవల ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్ తో విమర్శలు
  • ఆర్థికమంత్రి క్వాసీ కార్టెంగ్ ను తొలగించిన ట్రస్
  • బలంగా వినిపిస్తున్న రిషి సునాక్ పేరు
Bets on Rishi Sunak as he will replace Liz Truss

ఇటీవల బ్రిటన్ ప్రధానమంత్రిగా కన్జర్వేటివ్ పార్టీ అధినేత లిజ్ ట్రస్ బాధ్యతలు స్వీకరించడం తెలిసిందే. మాజీ మంత్రి రిషి సునాక్ ప్రధాని పదవి రేసులో ఆమెకు గట్టి పోటీ ఇచ్చి ఓటమిపాలయ్యారు. అయితే, లిజ్ ట్రస్ అధికారం చేపట్టిన కొన్నిరోజులకే సొంత పార్టీలో సంక్షోభం నెలకొంది. ఆర్థిక మార్కెట్లలోనూ ట్రస్ విధానాల పట్ల వ్యతిరేకత నెలకొంది. ఈ నేపథ్యంలో, ఆమె స్థానంలో రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని పదవిని చేపడతాడంటూ జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. 

బ్రిటన్ రాజకీయాల్లో గతవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తన సన్నిహితుడు క్వాసీ కార్టెంగ్ ను ఆర్థికమంత్రి పదవి నుంచి లిజ్ ట్రస్ తప్పించారు. ట్రస్ ఆర్థిక విధానాల అమలు బాధ్యతలను క్వాసీనే పర్యవేక్షిస్తున్నాడు. ఇటీవల ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్ తీవ్ర విమర్శలపాలైంది. 

ఎన్నికల సమయంలో రిషి సునాక్ ఏ ఆర్థిక అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారో అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయన్న భావనలు నెలకొన్నాయి. దాంతో, తాము సరైన అభ్యర్థిని ప్రధాని పదవికి ఎంచుకోలేదేమోనన్న ఆలోచన కన్జర్వేటివ్ సభ్యుల్లో బయల్దేరింది. 

ఇటీవల 'ద టైమ్స్' మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో 62 శాతం మంది తాము సరైన అభ్యర్థిని ఎంచుకోలేదని అభిప్రాయపడగా, 15 శాతం మంది మాత్రమే తాము సరైన అభ్యర్థిని ఎంచుకున్నామని తెలిపారు. 

ఈ నేపథ్యంలో, బ్రిటన్ లో పందాలు మొదలయ్యాయి. లిజ్ ట్రస్ ప్రధాని పదవి నుంచి దిగిపోవడం ఖాయమని, రిషి సునాక్ పగ్గాలు అందుకుంటారని అత్యధికులు పందాలు కాస్తున్నారు. బెట్టింగ్ సంస్థల ట్రెండ్స్ కూడా రిషి సునాకే ఫేవరెట్ అని సూచిస్తున్నాయి. 

ఇటీవల ఎన్నికల్లో పోరాడిన రిషి సునాక్... తాజా పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల కిందట ఆయన ఏర్పాటు చేసిన రెండు విందు కార్యక్రమాలు ఈ కోవలోకే వస్తాయని బ్రిటన్ మీడియా పేర్కొంది.

More Telugu News