Vizag: విశాఖకు పరిపాలనా రాజధాని వచ్చి తీరుతుంది: మంత్రి బొత్స

  • విశాఖకు రాజధానిపై ఉత్తరాంధ్ర ప్రజల్లో బలమైన కాంక్ష ఉందన్న బొత్స
  • విశాఖ గర్జనలో ఆ విషయం తేటతెల్లమైందని వెల్లడి
  • జనసేనను ఓ వ్యక్తి పెట్టుకున్న సంస్థగా అభివర్ణన
  • టీడీపీ, జనసేనలకు విశాఖపై అంత కక్ష ఎందుకని నిలదీత
ap minister botsa satyanarayana says ap administrative capital will established in vizag

విశాఖకు పరిపాలనా రాజధాని వచ్చి తీరుతుందని ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోమారు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ విషయంపై విస్పష్ట ప్రకటన చేశారు. ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని కూడా ఆయన పేర్కొన్నారు. విశాఖకు పరిపాలనా రాజధాని రావాలన్న కాంక్ష ఉత్తరాంధ్ర ప్రజల్లో బలంగా ఉందని కూడా ఆయన చెప్పారు. ఈ విషయం శనివారం నాటి విశాఖ గర్జనలో స్పష్టమైందని బొత్స తెలిపారు. 

ఈ సందర్భంగా జనసేన, టీడీపీలపై బొత్స విమర్శలు గుప్పించారు. విశాఖకు పరిపాలనా రాజధాని వస్తుంటే... టీడీపీ, జనసేన అడ్డుకుంటున్నాయని బొత్స ఆరోపించారు. 3 రాజధానుల అంశంపై ఆ రెండు పార్టీలకు ఉన్న అభ్యంతరం ఏమిటని బొత్స ప్రశ్నించారు. విశాఖకు పరిపాలనా రాజధాని రాకుండా ఆ రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. విశాఖకు వ్యతిరేకంగా ఆ రెండు పార్టీలు ఆడే ఆటలు ఇకపై చెల్లబోవని కూడా బొత్స అన్నారు. జనసేన అసలు ఓ రాజకీయ పార్టీనే కాదన్న బొత్స... ఓ వ్యక్తి పెట్టుకున్న సంస్థగా అభివర్ణించారు. జనసేనతో పాటు టీడీపీకి విశాఖపై అంత కక్ష ఎందుకని బొత్స ప్రశ్నించారు.

More Telugu News