Amaravati: నోటీసులు ఇవ్వ‌బోయిన పోలీసు అధికారి కాళ్ల‌పై ప‌డ‌బోయిన అమ‌రావతి ఐకాస నేత‌

  • ఆదివారం యాత్ర‌కు విరామం ప్ర‌క‌టించిన అమ‌రావ‌తి రైతులు
  • సోమ‌వారం గోదావ‌రి నాలుగో వంతెన మీదుగా రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న వైనం
  • నాలుగో వంతెన‌పై ఎలా వ‌స్తారో చెప్పాలంటూ నోటీసులు ఇచ్చేందుకు పోలీసుల య‌త్నం
  • నోటీసులను తిర‌స్క‌రించిన అమ‌రావ‌తి ఐకాస నేత‌లు
amaravati jac leaders rejects police notices on their yatra

ఏపీకి ఏకైక రాజ‌ధానిగా అమ‌రావ‌తిని కొన‌సాగించాలంటూ అమ‌రావ‌తి టూ అర‌స‌వెల్లి మ‌హాపాద‌యాత్ర పేరిట యాత్ర సాగిస్తున్న రాజ‌ధాని రైతుల‌కు పోలీసులు శ‌నివారం నోటీసులు ఇచ్చేందుకు య‌త్నించారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కోవూరులో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. పాద‌యాత్ర‌లో భాగంగా ఆదివారం యాత్ర‌కు విరామం ఇచ్చిన రైతులు సోమ‌వారం కోవూరు నుంచి గోదావ‌రి నాలుగో వంతెన మీదుగా రాజ‌మ‌హేంద్ర‌వ‌రం చేరుకోనున్నారు. గోదావ‌రిపై రోడ్ క‌మ్ రైల్ బ్రిడ్జిని మూసేసిన నేప‌థ్యంలో రైతులు నాలుగో వంతెన‌ను ఎంచుకున్నారు.

ఈ క్ర‌మంలో నాలుగో వంతెన మీదుగా యాత్ర‌ను ఎలా చేప‌డుతున్నారో తెల‌పాలంటూ పోలీసులు శ‌నివారం అమ‌రావ‌తి రైతుల ఐకాస నేత‌ల‌కు నోటీసులు అందించే య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో యాత్ర శిబిరం వద్దకు చేరుకున్న కోవూరు టూటౌన్ సీఐ ర‌వికుమార్‌... ఐకాస క‌న్వీనర్ శివారెడ్డి, కో క‌న్వీన‌ర్ గ‌ద్దె తిరుప‌తిరావుల‌కు నోటీసులు అందించే య‌త్నం చేశారు. 

అయితే, అవి తీసుకోవడానికి ఐకాస నేత‌లు ఇద్ద‌రూ తిర‌స్క‌రించారు. హైకోర్టు ఆదేశాల మేర‌కే తాము యాత్ర చేప‌డుతున్నామ‌ని, ఏమైనా చెప్పాలంటే కోర్టు ద్వారానే చెప్పాలని వారు తేల్చిచెప్పారు. ఈ క్ర‌మంలో నోటీసులు తీసుకోవాలంటూ సీఐ ర‌వికుమార్‌.. తిరుప‌తిరావుపై ఒత్తిడి చేశారు. దీంతో ఆయ‌న సీఐ కాళ్ల‌పై ప‌డ‌బోయారు. ఫ‌లితంగా నోటీసుల‌ను జారీ చేయ‌కుండానే పోలీసులు వెనుదిరిగారు.

More Telugu News