TRS: రాజకీయ వెట్టి చాకిరీని తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం భరించలేరంటూ కేసీఆర్​కు బూర నర్సయ్య గౌడ్ ఘాటు లేఖ

  • పార్టీకి రాజీనామా చేస్తూ కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన నర్సయ్య 
  • మునుగోడు ఉప్ప ఎన్నికలో తన అవసరం పార్టీకి లేదని తెలిసిందని వ్యాఖ్య 
  • తాను టికెట్ అడగలేదని, బీసీ అభ్యర్థిని నిలబెట్టాలనడమే తాను చేసిన నేరమా అని ప్రశ్న
  • ఉద్యమకారులు కేసీఆర్ ను ఒక్క నిమిషం కలవాలంటే  తెలంగాణ కంటే పెద్ద ఉద్యమమే చేయాల్సి వస్తోందని విమర్శ
Former MP Boora Narsaiah Goud sent his resignation to K Chandrashekhar Rao

మునుగోడు ఉప ఎన్నికకు ముందు టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆ పార్టీకి షాకిచ్చారు. త్వరలో ఆయన బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ కు తన రాజీనామా లేఖను ఆయన పంపించారు. ఈ బహిరంగ లేఖలో టీఆర్ఎస్, కేసీఆర్ తీరుపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీలో అనేక అవమానాలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. కేసీఆర్ అంటే అభిమానం, కృతజ్ఞతతో ఇప్పటిదాకా పార్టీలో ఉన్నానన్నారు. కానీ, అభిమానానికి, బానిసత్వానికి చాలా తేడా ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన రాజీనామాకు గల కారణాలను వరుసగా వివరించారు. 

మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తన అవసరం పార్టీకి లేదని తెలిసిందని చెప్పారు. ‘మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఒక మాజీ ఎంపీ అయినప్పటికీ, ఒక్కసారి కూడా మాతో సంప్రదించలేదు. నియోజకవర్గంలో జరిగిన ఆత్మగౌరవ సభలలో, ఉద్దేశపూర్వకంగా సమాచారం ఇవ్వకున్నా అవమానాన్ని దిగమింగి ఉన్నాను. అది మీకు తెలిసి కూడా మౌనంగా ఉన్నారు. మునుగోడు టికెట్ అసలు నాకు సమస్యనే కాదు, కానీ బీసీ సామజిక వర్గానికి టిక్కెట్ పరిశీలించండి అని అడగటం కూడా నేరమే అయితే అసలు ఈ పార్టీలో ఉండటమే అనవసరం’ అని పేర్కొన్నారు. 

రాజకీయ వెట్టి చాకిరీని తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం భరించలేరని ఆయన కామెంట్ చేశారు. ‘మీరంటే అభిమానం, ఇచ్చిన అవకాశాలకు కృతజ్ఞతతో ఇప్పటి వరకు ఉన్నాను, కానీ అభిమానానికి, బానిసత్వానికి చాల తేడా ఉంది. నేను వ్యక్తిగతంగా అవమాన పడ్డా, అవకాశాలు రాకున్నా పర్వాలేదు కానీ అట్టడుగు వర్గాల సమస్యలు కనీసం మీ దృష్టికి తీసుకు వచ్చే అవకాశమే లేనప్పుడు, నేను తెరాస పార్టీలో కొనసాగడం అర్థరహితం. రాజకీయ వెట్టి చాకిరీ తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం భరించలేరు. పదవుల కొరకు, పైరవీలు చేసే వ్యక్తిత్వం కాదని తెలిసి కూడా, మీరు కనీసం కలిసి ప్రజల సమస్యలు విన్నవించుకునే అవకాశం కూడా కల్పించలేదు. బడుగు బలహీన వర్గాల సమస్యలను నేను పదే పదే ప్రస్తావించడం, దానిపై మీరు నా పై అసహనం వ్యక్తం చేయడం ఒక ఉద్యమకారుడిగా ఎంతో బాధించింది’ అని నర్సయ్య పేర్కొన్నారు.  

 ఉద్యమంలో సీఎం కేసీఆర్ తో ఏళ్లుగా సన్నిహితంగా గడిపిన వాళ్లు ఇప్పుడు ఆయనతో ఒక్క నిమిషం మాట్లాడాలన్నా తెలంగాణ ఉద్యమం కంటే పెద్ద ఉద్యమమే చేయవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘తెలంగాణ ఉద్యమంలో రోజులు, నెలలు, ఏండ్లు గడిపిన మీ సన్నిహితులు, సహచర ఉద్యమకారులు కనీసం ఒక నిమిషం మీతో కలవాలంటే తెలంగాణ ఉద్యమం కంటే పెద్ద ఉద్యమం చేయవలసి వస్తుంది అని భావిస్తున్నారు. తన జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికి అంకితం చేసిన ఆచార్య జయశంకర్ గారి కనీసం 6 అంగుళాల విగ్రహం హైదరాబాద్ లో ప్రభుత్వం తరపున పెట్టకపోవడం, అందరినీ బాధిస్తున్న అంశం’ అని బూర నర్సయ్య గౌడ్ లేఖలో పేర్కొన్నారు.

More Telugu News