Supreme Court: హిజాబ్ వివాదంపై తీర్పు విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనంలో విభజన

  • నిషేధాన్ని సమర్థించిన జస్టిస్ హేమంత్ గుప్తా
  • కర్ణాటక సర్కారు ఆదేశాలను కొట్టివేసిన జస్టిస్ సుదాన్షు ధూలియా
  • దీంతో ప్రధాన న్యాయూమూర్తి ముందుకు వెళ్లిన అంశం
In Supreme Court split verdict in Karnataka hijab ban case

కర్ణాటక సర్కారు విద్యా సంస్థల్లో హిజాబ్ ధారణను నిషేధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై  తీర్పులో ఏకాభిప్రాయం కొరవడింది. సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఇరువురు న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులు వెల్లడించారు. ఈ కేసులో వాదనలు విన్న జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుదాన్షు ధూలియాతో కూడిన ధర్మాసనం సెప్టెంబర్ 22న తీర్పును రిజర్వ్ చేసింది. నేడు తీర్పు వెలువరించాల్సి ఉంది. 

కర్ణాటక ప్రభుత్వ ఆదేశాలను సమర్థిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించారు. కానీ, జస్టిస్ సుదాన్షు ధూలియా మాత్రం హిజాబ్ ధారణపై కర్ణాటక ప్రభుత్వ ఆదేశాలను కొట్టివేశారు. ఏకాభిప్రాయం కొరవడడంతో ఇప్పుడు ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ కు నివేదించారు. దీంతో ఈ కేసు విచారణ కోసం మరింతమంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 

విద్యా సంస్థల్లో అన్ని మతాల మధ్య ఏకరూపతకు వీలుగా హిజాబ్ ధారణను నిషేధించినట్టు కర్ణాటక సర్కారు సమర్థించుకుంది. ఈ నిషేధం వల్ల ముస్లిం విద్యార్థినులు తరగతులకు హాజరు కాలేరని పిటిషన్ తరఫు న్యాయవాది విచారణ సందర్భంగా ధర్మాసనానికి విన్నవించారు. కర్ణాటక ప్రభుత్వ ఆదేశాలకు అనుకూలమైన తీర్పును ఆ రాష్ట్ర హైకోర్టు ఈ ఏడాది మార్చిలో జారీ చేసింది.

More Telugu News