Aha: అన్‌స్టాప‌బుల్ 2 ప్రోమో వ‌చ్చేసింది!... బాల‌య్య ప్ర‌శ్న‌ల‌కు అదిరే ఆన్స‌ర్లిచ్చిన చంద్ర‌బాబు!

  • ఈ నెల 14 నుంచి అన్‌స్టాప‌బుల్ 2 షో
  • తొలి ఎపిసోడ్‌లో గెస్ట్‌గా హాజ‌రైన చంద్ర‌బాబు, నారా లోకేశ్
  • స‌ర‌దా ప్ర‌శ్న‌ల‌తో పాటు సీరియ‌స్ ప్ర‌శ్న‌లు సంధించిన బాల‌య్య‌
  • ఏమాత్రం త‌డుముకోకుండా స‌మాధానాలు చెప్పిన చంద్ర‌బాబు, లోకేశ్
unstoppable 2 first episode promo released

ఆహా ఓటీటీలో ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న అన్‌స్టాప‌బుల్ 2కు రంగం సిద్ధ‌మైపోయింది. టాలీవుడ్ అగ్ర హీరో, టీడీపీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ ఈ షో తొలి ఎపిసోడ్‌లోనే టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ షోకు సంబంధించిన షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి కాగా... మంగ‌ళ‌వారం సాయంత్రం ఆహా యాజ‌మాన్యం ప్రోమోను విడుద‌ల చేసింది. 

5.31 నిమిషాల నిడివి ఉన్న ఈ ప్రోమోలో బాల‌య్య చాలా క్లిష్ట‌మైన ప్ర‌శ్న‌లు సంధించ‌గా... వాటికి ఏమాత్రం త‌గ్గ‌కుండానే చంద్ర‌బాబు కూడా అదిరిపోయే స‌మాధానాలిచ్చారు. స‌ర‌దా ప్ర‌శ్న‌ల‌తో పాటు సీరియ‌స్ ప్ర‌శ్న‌ల‌ను కూడా బాల‌య్య సంధించారు. 1995లో టీడీపీ చీలిక‌పైనా ప్ర‌శ్న రాగా... చంద్ర‌బాబు ఏమాత్రం త‌డుముకోకుండానే స‌మాధానం ఇచ్చారు. నాడు తాను చేసిన ప‌ని త‌ప్పంటారా?అంటూ బాల‌య్య‌కు ఆయ‌న ఎదురు ప్ర‌శ్న వేశారు. 

ఇక ఈ షో మ‌ధ్య‌లో ఎంట్రీ ఇచ్చిన టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ తండ్రి ప‌క్క‌నే కూర్చుని మామ‌య్య ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. మంగ‌ళ‌గిరిలో ఓట‌మిపైనా లోకేశ్ ఏమాత్రం బేష‌జాల‌కు పోకుండానే స్పందించారు. కాసేపు హోస్ట్ సీటులో కూర్చున్న లోకేశ్ తండ్రితో పాటు మామ‌య్య‌కు కూడా ప్ర‌శ్న‌లు వేసిన తీరు ఆక‌ట్టుకుంది. ఈ షో ఈ నెల 14న ఆహాలో ప్ర‌సారం కానుంది.

More Telugu News