AP High Court: తన కుమార్తెను అమ్మమ్మ, తాతయ్య నిర్బంధించారంటూ తండ్రి పిటిషన్.. చిన్నారి సంక్షేమం ముఖ్యమన్న ఏపీ హైకోర్టు

  • హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన బాపట్ల జిల్లా వాసి
  • చిన్నారి సంరక్షణ బాధ్యతను వారు చూస్తే తప్పేంటని ప్రశ్నించిన ధర్మాసనం
  • అది చట్టవిరుద్ధం కాదని స్పష్టం చేసిన న్యాయస్థానం 
  • కస్టడీ కోసం సివిల్ కోర్టును ఆశ్రయించాలని సూచన
Father alleged that his daughter was detained by her grandparents

తన కుమార్తెను అమ్మమ్మ, తాతయ్య అక్రమంగా నిర్బంధించారంటూ ఓ తండ్రి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. చిన్నారి తల్లి చనిపోవడంతో ఆ పాప ఆలనా పాలనా వారే చూస్తున్నారని, కాబట్టి వారి వద్ద ఉండడంలో తప్పులేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాల్లోకి వెళ్తే.. బాపట్ల జిల్లాకు చెందిన సి.గోపి-కె.మౌనికలకు 2020లో వివాహమైంది. ఆ తర్వాత వారికి ఓ పాప జన్మించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అనారోగ్యంతో మౌనిక మరణించింది. దీంతో చిన్నారిని ఆమె అమ్మమ్మ, తాతయ్యలు సంరక్షిస్తున్నారు. 

అయితే, అత్తమామలు తన కుమార్తెను అక్రమంగా ఎత్తుకెళ్లారని, చిన్నారిని తనకు తిరిగి అప్పగించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ గోపి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఈ వ్యాజ్యాన్ని విచారించిన ఉన్నత న్యాయస్థానం అతడి పిటిషన్‌ను కొట్టివేసింది. చిన్నారి సంరక్షణ బాధ్యతలను అమ్మమ్మ, తాతయ్య చూడడంలో తప్పులేదని స్పష్టం చేసింది. పది నెలల పాప పుట్టినప్పటి నుంచి వారి సమక్షంలోనే పెరుగుతోందని గుర్తు చేసింది. పాపకు జన్మతః సంరక్షకుడు ఎవరనేది ముఖ్యం కాదని, చిన్నారి సంక్షేమమే ముఖ్యమని పేర్కొంది. 

అంతేకాదు, చిన్నారిని తనకు అప్పగించాలన్న తండ్రి తనకు నిర్దిష్ట ఆదాయం ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు చూపలేదని పేర్కొంది. అయినా, అమ్మమ్మ, తాతయ్యలు చిన్నారి ఆలనా పాలన చూడడం చట్టవిరుద్ధం కాదని స్పష్టం చేసింది. పాప కస్టడీ కోసం సంబంధిత సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చని పిటిషనర్‌కు సూచించింది. అంతేకాదు, కస్టడీ వ్యవహారం తేలే వరకు ప్రతి ఆదివారం పాపను చూసుకునేందుకు పిటిషనర్‌కు న్యాయస్థానం అవకాశం ఇచ్చింది.

More Telugu News