Nasa: అంతరిక్షంలో అద్భుతమైన గ్యాస్ బెలూన్ 'బబుల్ నెబ్యులా'... ఫొటో, వివరాలు విడుదల చేసిన నాసా

  • 7,100 కాంతి సంవత్సరాల దూరంలో 'బబుల్ నెబ్యులా'
  • ఇన్ స్టాగ్రామ్ లో ఫొటో, వివరాలతో నాసా పోస్టు 
  • ఒక్కరోజులోనే 15 లక్షలకు పైగా లైకులు
  • మనకు తెలియనిది ఎంతో ఉందంటూ నెటిజన్ల కామెంట్లు
Nasa shares mesmerising pic of bubble nebula

మన విశ్వం ఎన్నో విచిత్రాలు, వింతలకు నిలయం. అందులో మనకు తెలియని, మనం ఊహించలేని ఎన్నో ఉన్నాయి. నాసా తమ పరిశోధనల్లో వాటిని గుర్తిస్తూ మనకు అందిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఒక అద్భుతమైన ‘బబుల్ నెబ్యులా’ చిత్రాన్ని విడుదల చేసింది. భూమికి 7,100 కాంతి సంవత్సరాల దూరంలో కాస్సియోపియా నక్షత్ర మండలంలో ఈ చిత్రమైన నెబ్యులా ఉన్నట్టు ప్రకటించింది.

ఏమిటీ నెబ్యులాలు?
అంతరిక్షంలో భారీ ఎత్తున వాయువులు (గ్యాస్), అంతరిక్ష పదార్థాలతో కూడిన ప్రదేశమే నెబ్యులాగా చెప్పవచ్చు. భారీ నక్షత్రాల నుంచి వెలువడే పదార్థాలతో గానీ , నక్షత్రాలు పేలిపోయినప్పుడు గానీ నెబ్యులాలు ఏర్పడుతాయి. ఈ నెబ్యులాల్లోని పదార్థాలు గురుత్వాకర్షణతో మళ్లీ ఒక్క దగ్గరికి చేరి నక్షత్రాలు, గ్రహాలుగా కూడా ఏర్పడుతుంటాయి.

అత్యంత భారీగా..
నీలి రంగులో ప్రకాశవంతంగా మెరిసిపోతున్న బబుల్ నెబ్యులా.. మన సూర్యుడికన్నా 45 రేట్లు పెద్దగా ఉన్న ఓ నక్షత్రం చుట్టూ ఆవరించి ఉన్నట్టు నాసా తెలిపింది. ఆ నక్షత్రంలో జరిగే ఉష్ణ, రసాయనిక చర్యలతో పదార్థం బయటికి వెలువడి నెబ్యులాగా విస్తరించిందని పేర్కొంది. ఇది ఏకంగా ఏడు కాంతి సంవత్సరాల విస్తీర్ణంలో ఉందని వివరించింది.

  • ఒక కాంతి సంవత్సరం అంటే కాంతి ఒక ఏడాదిలో ఎంత దూరం ప్రయాణిస్తుందో అంత దూరం అన్నమాట. కాంతి సెకనుకు మూడు లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అంటే ఏడాదిలో ఎంత దూరమో ఊహించుకోవడమే కష్టం. ఆ దూరాన్ని లెక్కల్లో చెప్పలేకనే.. కాంతి సంవత్సరాల్లో చెబుతుంటారు.
  • ఇన్ స్టాగ్రామ్ లో నాసా పెట్టిన ఫొటోకు కేవలం ఒక్కరోజులోనే ఏకంగా 15 లక్షలకుపైగా లైకులు రావడం గమనార్హం. ఇది అద్భుతంగా ఉందంటూ వేల మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
  • ‘‘మన విశ్వం ఎంతో అందమైనది. అనంతమైనది. ఇప్పటికీ మనకు తెలియనిది ఎంతో ఉందని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది..” అని కొందరు కామెంట్లలో పేర్కొన్నారు.

More Telugu News