India: చైనాలో ఉయిగర్ ముస్లింలపై వేధింపుల అంశంలో తొలిసారి గళం విప్పిన భారత్

  • ఐరాస మానవ హక్కుల కమిషన్ తీర్మానం
  • ఓటింగ్ కు దూరంగా ఉన్న భారత్
  • మానవ హక్కులను గౌరవించాలని స్పష్టీకరణ
  • హక్కుల పరిరక్షణకు భరోసా ఇవ్వాలని వెల్లడి
India first time responds in China Uighur minorities issue

చైనాలోని జిన్ జియాంగ్ ప్రావిన్స్ లో ఉయిగర్ ముస్లిం మైనారిటీలపై ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతోందన్న తీవ్ర ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. వారిని ప్రత్యేక క్యాంపుల్లో నిర్బంధించి హింసిస్తూ, చైనా తీవ్రస్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ జిన్ జియాంగ్ ప్రావిన్స్ అంశంపై చర్చకు ప్రతిపాదన చేయగా, ఓటింగ్ కు భారత్ దూరంగా ఉంది. మరో 10 దేశాలు కూడా ఓటింగ్ లో పాల్గొనలేదు. అంతేకాదు, చైనాకు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం భారత్ కు ఉన్నా, భారత్ ఓటింగ్ కు గైర్హాజరైంది. 

ఈ ఓటింగ్ ముగిసిన ఒక రోజు తర్వాత భారత్ స్పందించింది. చైనాలోని ఉయిగర్ ముస్లింల అంశంపై తొలిసారి బహిరంగంగా తన అభిప్రాయాలను వెల్లడించింది. జిన్ జియాంగ్ ప్రావిన్స్ లోని ప్రజల మానవ హక్కులను గౌరవించాలని, హక్కుల పరిరక్షణకు భరోసా ఇవ్వాలని భారత్ పిలుపునిచ్చింది. సంబంధింత వర్గాలు ఈ అంశాన్ని తగిన రీతిలో పరిష్కరించాలని సూచించింది. 

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి స్పందిస్తూ... మానవ హక్కుల పరిరక్షణకు భారత్ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి అంశాల్లో నిర్దిష్ట తీర్మానాల వల్ల ఉపయోగం ఉండదని భారత్ సుదీర్ఘకాలంగా భావిస్తోందని, ఈ తరహా అంశాల్లో చర్చలే పరిష్కారం చూపుతాయన్నది భారత్ నిశ్చితాభిప్రాయం అని వెల్లడించారు.

More Telugu News