Xiaomi: భారత్ నుంచి పాకిస్థాన్ తరలిపోతున్నట్టు వస్తున్న వార్తలపై చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం షామీ స్పందన

  • షామీ సంస్థపై ఈడీ దర్యాప్తు
  • ఇప్పటికే రూ.5,551 కోట్ల జప్తు
  • షామీపై తాజా ప్రచారం
  • ఖండించిన చైనా దిగ్గజ సంస్థ
Xiaomi responds to speculations

ప్రముఖ చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం షామీ ఇండియా విభాగం భారత్ లో ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) విచారణ ఎదుర్కొంటుండడం తెలిసిందే. ఈడీ ఇప్పటికే షామీ నిధులను రూ.5,551 కోట్ల మేర స్తంభింపజేసింది. దాంతో, షామీ భారత్ నుంచి తమ వ్యాపారాన్ని పాకిస్థాన్ కు తరలిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. 

ఈ ప్రచారంపై షామీ స్పందించింది. ఈ కథనాలు పూర్తిగా నిరాధారమని, వాటిలో నిజం లేదని స్పష్టం చేసింది. బహుశా సంచలనం కోసం ఇలాంటి కథనాలు పుట్టించి ఉండొచ్చని షామీ అభిప్రాయపడింది. 

భారత్ లో 2014 జులైలో ప్రవేశించామని, ఆ మరుసటి ఏడాదే కార్యకలాపాలు ప్రారంభించామని షామీ వెల్లడించింది. మేక్ ఇన్ ఇండియా కార్యాచరణలో భాగంగా ఇవాళ 99 శాతం స్మార్ట్ ఫోన్లు, టెలివిజన్లను భారత్ లోనే తయారుచేస్తున్నామని స్పష్టం చేసింది. ఇప్పుడు జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొంది. 

విదేశీ మారకద్రవ్య చెల్లింపుల్లో భాగంగా అక్రమాలు చోటుచేసుకున్నాయని, షామీ ఫెమా ఉల్లంఘనలకు పాల్పడిందని ఈడీ భావిస్తోంది. భారత్ లో వ్యాపారం నిర్వహిస్తూ, విదేశాల్లో ఉన్న సంస్థలకు రాయల్టీ చెల్లిస్తున్నట్టు ఈడీ గుర్తించింది.

More Telugu News