T-14 Aramata: ఉక్రెయిన్ యుద్ధ రంగంలోకి శత్రు భీకర టీ-14 అర్మాటా యుద్ధ ట్యాంకు

  • ఈ యుద్ధ ట్యాంకు పూర్తిగా డిజిటల్ 
  • డ్రోన్లను కూడా ప్రయోగించే సత్తా
  • లేజర్ గైడెడ్ మిస్సైళ్లతో ప్రత్యర్థి పనిపట్టే అర్మాటా
  • గంటకు 80 కిమీ వేగంతో పయనం
Russia to deploy fierce T14 Armata battle tank

గత ఏడు నెలలుగా ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్న రష్యా ఇప్పటికీ స్పష్టమైన విజయం సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో, ఉక్రెయిన్ లో తమకు గట్టిగా ప్రతిఘటన ఎదురవుతున్న ప్రాంతాల్లో శత్రుభీకర టీ-14 అర్మాటా యుద్ధ ట్యాంకును రంగంలోకి దింపాలని రష్యా భావిస్తోంది. 

అర్మాటా యుద్ధ ట్యాంకులో పూర్తిగా కంప్యూటరైజ్డ్ డిజిటల్ వ్యవస్థలు పొందుపరిచారు. సిబ్బంది కోసం దుర్భేద్యమైన క్యాబిన్ ఉంటుంది. ఈ ట్యాంకుకు 152 ఎంఎం గన్ అమర్చారు. ఈ ట్యాంకు డ్రోన్లను ప్రయోగించగలదు.

అంతేకాదు, దీంట్లోని టర్రెట్ (పేలుడు పదార్థాలను సంధించే విభాగం) మానవరహితం. దాంతో యాంటీ ట్యాంకు మిస్సైళ్లు దీన్ని లక్ష్యంగా చేసుకున్నప్పటికీ మానవనష్టం ఉండదు. ఈ అర్మాటా యుద్ధ ట్యాంకులో అత్యాధునిక సెన్సర్లతో పాటు డేటా నెట్వర్కింగ్ వ్యవస్థ కూడా ఉంటుంది. చాలా వరకు ఇది ఆటోమేటిగ్గా పనిచేస్తుంది. ఇది లేజర్ గైడెడ్ మిస్సైళ్లను కూడా ప్రయోగించగలదు. ఈ ట్యాంకు గరిష్ఠ వేగం గంటకు 80 కిలోమీటర్లు. ఎలాంటి ఉపరితలాలపై అయినా ప్రయాణించగలదు. 

ఈ ట్యాంకులను పెద్ద సంఖ్యలో ఉక్రెయిన్ యుద్ధరంగంలో మోహరించాలన్నది రష్యా నూతన ప్రణాళిక. ఇప్పటిదాకా రష్యా దాడులను సమర్థంగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ బలగాలు... ఈ ప్రమాదకర ట్యాంకులను ఎదుర్కొనగలవా? అనే సందేహాలు వినిపిస్తున్నాయి.

More Telugu News