Five foods to weight loss: ఈ ఐదు ఆహార పదార్థాలు బరువు తగ్గేందుకు తోడ్పడుతాయంటున్న నిపుణులు

  • వ్యాయామం, వాకింగ్, డైటింగ్ వంటివాటికి తోడుగా ఆహార పదార్థాలపై దృష్టి పెట్టాలని నిపుణుల సూచన
  • చాకోలెట్, పాప్ కార్న్, రెడ్ వైన్ వంటివి బరువు తగ్గేందుకు తోడ్పడుతాయని వెల్లడి
  • అయితే వైద్య నిపుణుల సూచనల మేరకు ఆహారంలో మార్పులు చేసుకోవాలని సూచనలు
Five surprising foods that may help in weight loss

శరీరానికి తగినంతగా వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు పెరిగిపోవడంతో కొంతకాలంగా ఊబకాయుల సంఖ్య పెరిగిపోతోంది. తెలియకుండానే బరువు పెరిగిపోయిన చాలా మంది.. దానివల్ల సమస్యలను గుర్తించి తిరిగి బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాయామాలు, వాకింగ్, డైటింగ్ వంటివి పాటిస్తూ బరువు తగ్గించుకునే పనిలో ఉన్నారు. అయితే ఇవన్నీ చేస్తూనే ఐదు రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

1. డార్క్ చాక్లెట్లు 
సాధారణంగా చాక్లెట్లు తింటే బరువు పెరుగుతారన్న అభిప్రాయం ఉంది. నిజానికి చక్కెర శాతం ఎక్కువగా ఉన్న చాక్లెట్లు తింటే అదే జరుగుతుంది. అదే చక్కెర శాతం తక్కువగా ఉండే చాక్లెట్లు తినడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుందని వైద్య, పోషకాహార నిపుణులు చెబుతున్నారు. డార్క్ చాక్లెట్లు మన శరీరంలో పాలిఫెనోలిక్ రసాయనాల ఉత్పత్తికి తోడ్పడుతాయని. వీటిలోని ఫ్యాటీ యాసిడ్లు శరీరంలో ఇన్ ఫ్లమేషన్ ను తగ్గిస్తాయని వివరిస్తున్నారు. ఇవన్నీ శరీరంలో జీవక్రియలను మెరుగుపర్చి.. కొవ్వు త్వరగా కరగడానికి వీలు కల్పిస్తాయని స్పష్టం చేస్తున్నారు.

2. రెడ్ వైన్
 నిజానికి ఆల్కాహాల్ ఉత్పత్తులకు దూరంగా ఉండటం చాలా మంచిది. కానీ రెడ్ వైన్ వల్ల మాత్రం ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రెడ్ వైన్ లో ఉండే రెస్వరట్రోల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రణలో ఉంచుతాయని, గుండె ఆరోగ్యానికి మంచిదని వివరిస్తున్నారు. అయితే రెడ్ వైన్ ను పరిమిత స్థాయిలోనే తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.

3. పాప్ కార్న్
 తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండి కడుపు నిండినట్టుగా భావన కల్పించే ఆహారం పాప్ కార్న్. ఒక కప్పు పాప్ కార్న్ తిన్నా శరీరానికి అందేది కేవలం 31 కేలరీలే. కానీ కడుపు నిండిన భావన ఉండటంతో మళ్లీ మళ్లీ ఏదో ఒకటి తినడం తగ్గుతుందని.. అంతిమంగా ఇది బరువు తగ్గానికి తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

4. కాఫీ
 మన శరీరంలో జీవక్రియలను ప్రేరేపించడంలో కాఫీ అద్భుతంగా పనిచేస్తుంది. చక్కెరను అతి తక్కువగా వేసుకుని కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఆకలిని తగ్గిస్తుందని, అదే సమయంలో శరీరంలో కొవ్వు కరిగేందుకు వీలు కల్పిస్తుందని పేర్కొంటున్నారు. అయితే అతిగా కాఫీ తాగడం వల్ల ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. 

5. ఆవాలు
 భారతీయ వంటకాల్లో చాలా వరకు ఆవాలను వినియోగిస్తుంటాం. ఒక టీస్పూన్ ఆవాలు మన శరీరంలో జీవక్రియలను 25శాతం మేర పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల వర్కౌట్ లు చేసినప్పుడు శరీరంలో కొవ్వు వేగంగా కరుగుతుందని, ఎక్కువ కేలరీలు ఖర్చయి.. బరువు తగ్గడానికి తోడ్పడుతుందని వివరిస్తున్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి
బరువు ఎక్కువగా ఉండటం, తగ్గడానికి వివిధ ప్రయత్నాలు చేయడం ఏదైనా వైద్యులను సంప్రదించి తగిన సలహా తీసుకోవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేవలం ఆహారంలో మార్పు వల్ల బరువు తగ్గడం వీలుకాదని.. వ్యాయామాలు, ఇతర అంశాలనూ పాటించాల్సి ఉంటుందని వివరిస్తున్నారు.

More Telugu News