white or pink Guava: తెలుపు, గులాబీ.. గుజ్జు ఏ రంగులో ఉండే జామ పండ్లతో ఏమేం లాభాలో నిపుణులు చెబుతున్న వివరాలివీ

  • గులాబీ గుజ్జు పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ.. చక్కెర శాతం తక్కువ
  • తెలుపు రంగు వాటిలో విటమిన్ సీ ఎక్కువ.. జలుబు ఉన్నప్పుడూ తినొచ్చు
  • గుజ్జు ఏ రంగులో ఉన్నా జామ పండ్లతో అద్భుత ప్రయోజనాలు ఉంటాయని స్పష్టీకరణ
White or pink guava health benefits

జామ పండ్లు అంటే చాలా మందికి ఇష్టమే. సీజన్ లో ఆ పండ్లు మార్కెట్లోకి వచ్చాయంటే వెంటనే కొనుక్కుని తినేయడమే ఆలస్యం. అయితే జామ పండ్లలో లోపల గుజ్జు తెలుపు రంగులో ఉండే ఒకరకం, కాస్త గులాబీ రంగులో ఉండే మరో రకం ఉంటాయి. రెండూ జామ పండ్లే అయినా.. రెండింటితోనూ అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నా కూడా.. వాటిలో కొంత భిన్నమైన పోషకాలు ఉంటాయని, భిన్నమైన ప్రయోజనాలు లభిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

జామ పండ్లతో లాభాలు ఎన్నో..
సాధారణంగా జామ పండ్లతో ఎన్నో లాభాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటానికి, గుండె ఆరోగ్యం మెరుగుపడటానికి, బరువు తగ్గడానికి, జీర్ణ వ్యవస్థ బాగా పనిచేయడానికి జామ పండ్లు తోడ్పడుతాయని వివరిస్తున్నారు. అంతేగాకుండా జామ పండ్లలోని పదార్థాలు కేన్సర్ రాకుండా చూస్తాయని, రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయని చెబుతున్నారు. మన చర్మానికి కూడా మేలు చేస్తాయని స్పష్టం చేస్తున్నారు.

ఏ రంగు గుజ్జుతో ఏమేం ప్రయోజనాలు?
వైద్య, పోషకాహార నిపుణులు, డైటీషియన్లు చెప్తున్న వివరాల ప్రకారం.. తెలుపు, గులాబీ రంగు జామ పండ్లలో వేర్వేరుగా ప్రయోజనాలు ఉంటాయి. మధుమేహంతో బాధపడుతున్నవారు గులాబీ రంగు గుజ్జు ఉన్న జామ పండ్లు తీసుకోవాలి.

  • గులాబీ రంగు గుజ్జు ఉండే జామ పండ్లలో నీటి శాతం ఎక్కువగా, చక్కెర, పిండి పదార్థాల (స్టార్చ్) శాతం తక్కువగా ఉంటాయి. విటమిన్ సి కూడా తక్కువగా ఉంటుంది. అయితే వీటిలో గింజలు తక్కువ. తినడానికి అనుకూలంగా ఉంటాయి.
  • తెలుపు రంగు గుజ్జు ఉండే జామ పండ్లలో చక్కెర, పిండి పదార్థాలతో పాటు విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అయితే వీటిలో గింజలు ఎక్కువ. తినడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది.
  • కేన్సర్ ను దూరంగా ఉంచి, ఆరోగ్యాన్ని ఇచ్చే యాంటీ ఆక్సిడెంట్లు అన్ని జామ పండ్లలో ఉంటాయి. అయితే గులాబీ గుజ్జు ఉండేవాటిలో మరింత ఎక్కువగా ఉంటాయి.
  • గులాబీ గుజ్జు ఉన్న జామ పండ్లలో కెరోటినాయిడ్లు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ఏ, ఒమేగా–3, ఒమేగా–6 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఎక్కువ. ఇవి నేత్రాలు, కేశాలు, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతాయి. 
  • జలుబు, దగ్గుతో బాధపడుతున్నవారు గులాబీ గుజ్జు ఉండే జామ పండ్లు తింటే ఇబ్బంది మరింత పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అదే తెలుపు రంగులో, గట్టిగా గుజ్జు ఉన్న జామ పండ్లను తీసుకోవడం వల్ల ఉపశమనం ఉంటుందని వివరిస్తున్నారు.
  • జామ పండ్లను కోసిన వెంటనే తినాలని, కోసి పెట్టి ఎక్కువసేపు వదిలేస్తే వాటిలోని విటమిన్ సి శాతం తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
  • అయితే గులాబీ, తెలుపు రంగు గుజ్జు అని కాకుండా.. ఏవి అయినా సరే జామ పండ్లతో అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని.. ఏదో ఒక రకమే తినాలన్న ఉద్దేశం అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

More Telugu News