Jammu And Kashmir: జమ్మూకశ్మీర్ జైళ్ల శాఖ డీజీపీ దారుణ హత్య.. గొంతు కోసి తగలబెట్టే యత్నం

  • ఇంట్లోనే హత్యకు గురైన డీజీపీ హేమంత్ కుమార్ లోహియా
  • హత్య తర్వాత కనిపించకుండా పోయిన ఇంటి సహాయకుడు
  • నిందితుడి కోసం వేట ప్రారంభించిన పోలీసులు
J and K prisons DGP killed in his house Domestic Help in Absconding

జమ్మూకశ్మీర్ జైళ్ల శాఖ డీజీపీ హేమంత్ కుమార్ లోహియా తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లోంచి దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లో పనిచేసే వ్యక్తిపై అనుమానాలు వ్యక్తం కావడంతో అతడి కోసం గాలిస్తున్నారు. జమ్మూలోని తన ఇంట్లో పునరుద్ధరణ పనులు జరుగుతుండడంతో తన స్నేహితుడైన రాజీవ్ ఖజురియా ఇంట్లో హేమంత్ తన కుటుంబంతో కలిసి ఉంటున్నారు. 

హేమంత్ హత్య తర్వాత ఆయన ఇంట్లో పనిచేసే సహాయకుడు అదృశ్యమయ్యాడని జమ్మూ జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) ముకేశ్ సింగ్ తెలిపారు. కనిపించకుండా పోయిన ఆ సహాయకుడిని యాసిర్‌గా గుర్తించినట్టు తెలిపారు. అతడిది జమ్మూకశ్మీర్‌లోని రాంబాన్ జిల్లా అని పేర్కొన్నారు. అతడి కోసం వేట మొదలుపెట్టినట్టు చెప్పారు. 

57 ఏళ్ల లోహియా 1992 ఐపీఎస్ అధికారి. నిన్న ఆయన తన ఉడాయివాలా నివాసంలో హత్యకు గురయ్యారు. దుండగులు ఆయన గొంతు కోసి హతమార్చారు. అలాగే, ఆయన శరీరంపై కాలిన గాయాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో లోహియా ప్రిజన్స్ డీజీపీగా నియమితులయ్యారు. నిందితుడు తొలుత లోహియాను ఊపిరాడనివ్వకుండా చేసి చంపాడని, ఆపై కిచెన్‌లోని పగిలిన సీసాతో గొంతు కోసినట్టు తెలుస్తోందని డీజీపీ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు. నిందితుడు లోహియా గొంతు కోసిన అనంతరం మృతదేహాన్ని తగలబెట్టే ప్రయత్నం చేశాడని వివరించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.

More Telugu News