Bhopal: విచిత్ర ఆచారం.. నవరాత్రుల్లో అమ్మవారికి పాదరక్షల సమర్పణ

  • మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని జిజిబాయ్ ఆలయంలో వింత ఆచారం
  • చెప్పులు, బూట్లు, కళ్లద్దాలు, టోపీలు సమర్పణ
  • విదేశాల నుంచి అమ్మవారికి చెప్పులు, బూట్లు 
  • అమ్మవారు రాత్రివేళ చెప్పులు ధరిస్తారని విశ్వాసం
  • ఈసారి సింగపూర్, అమెరికా, ప్యారిస్, జర్మనీ నుంచి అమ్మవారికి చెప్పులు
bhopal jiji bai temple durga devi gets slippers and sandals

ఆలయాన్ని సందర్శించిన సమయంలో తృణమో, పణమో సమర్పించుకోవడం పరిపాటి. కానీ, భోపాల్‌లోని ఓ ఆలయంలో మాత్రం అమ్మవారికి చెప్పులను కానుకగా సమర్పిస్తారు. ఈ ఆచారం ఎప్పటి నుంచి వచ్చిందన్న విషయాన్ని పక్కనపెడితే అమ్మవారికి చెప్పులు, షూ సమర్పిస్తారన్న వార్త వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉంది. అయినప్పటికీ ఇది నిజం.

ఇక్కడ కోలా ప్రాంతంలో జిజిబాయి (పహాడీవాలీ మాత) ఆలయం ఉంది. నవరాత్రుల సందర్భంగా ఇక్కడ అమ్మవారు నిత్యం పూజలు అందుకుంటుంది. అమ్మవారిని భక్తులు తమ కుమార్తెగా భావించి పూజలు చేస్తారు. రాత్రిపూట అమ్మవారు చెప్పులు ధరిస్తారని భక్తులు విశ్వసిస్తారు. అందుకనే ఆమెకు చెప్పులు, బూట్లు కానుకలుగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. 

అమ్మవారికి పాదరక్షలు సమర్పిస్తే ప్రసన్నురాలై తమ కోర్కెలు తీరుస్తారని గ్రామస్థులు చెబుతున్నారు. నవరాత్రుల సందర్భంగా విదేశాల నుంచి కూడా భక్తులు అమ్మవారి కోసం చెప్పులు, అలంకరణ సామగ్రి పంపిస్తారని ఆలయ పూజారి ఓం ప్రకాశ్ మహారాజ్ తెలిపారు. చెప్పులు, బూట్లతోపాటు టోపీలు, కళ్లద్దాలు, వాచీలను కూడా సమర్పిస్తారని పేర్కొన్నారు. ఈసారి సింగపూర్, ప్యారిస్, జర్మనీ, అమెరికా నుంచి కూడా అమ్మవారికి చెప్పులు అందినట్టు ఆయన తెలిపారు.

More Telugu News