Salman Khan: బాలీవుడ్, దక్షిణాది చిత్ర పరిశ్రమ కలిస్తే రూ.4 వేల కోట్ల కలెక్షన్లు ఖాయం: సల్మాన్ ఖాన్

  • చిరంజీవి హీరోగా గాడ్ ఫాదర్
  • చిత్రంలో కీలక పాత్ర పోషించిన సల్మాన్ ఖాన్
  • హిందీ ట్రైలర్ విడుదల కార్యక్రమం
  • హాజరైన సల్మాన్
  • దక్షిణాది సినిమాలపై ఆసక్తి
Salman Khan says huge collection if Bollywood stars and South stars make a movie

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం అక్టోబరు 5న రిలీజ్ కానుండగా, చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. గాడ్ ఫాదర్ చిత్రం హిందీ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన దక్షిణాది సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరూ హాలీవుడ్ సినిమాలు చేయాలని అడుగుతున్నారని, కానీ తాను దక్షిణాది సినిమాలు చేయాలని కోరుకుంటానని వెల్లడించారు. "జనాలు రూ.300 కోట్లు, రూ.400 కోట్లు గురించి మాట్లాడుతుంటారు. కానీ బాలీవుడ్ స్టార్లు, దక్షిణాది స్టార్లు కలిసి సినిమాలు చేస్తే బాక్సాఫీసు వద్ద ప్రభంజనమే. రూ.3000 కోట్లు, రూ.4000 కోట్ల వసూళ్లు వచ్చిపడతాయి. ఆ సినిమా ఎంతోమంది ప్రేక్షకులకు చేరువ అవుతుంది. ఆ సినిమాను బాలీవుడ్ లో చూస్తారు, దక్షిణాదిలోనూ చూస్తారు. 

'గాడ్ ఫాదర్' సినిమానే తీసుకుంటే చిరంజీవి అభిమానులు కాస్తా నా అభిమానులుగా మారిపోతారు... అలాగే నా అభిమానులు చిరంజీవిని కూడా అభిమానించడం ప్రారంభిస్తారు. తద్వారా సినిమాకు ఎంత లాభం జరుగుతుందో చూడండి!" అని సల్మాన్ ఖాన్ వివరించారు.

మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని మోహన్ రాజా దర్శకత్వంలో తెలుగులో 'గాడ్ ఫాదర్' గా రీమేక్ చేయడం తెలిసిందే. ఇందులో నయనతార, సత్యదేవ్ కూడా నటించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో సల్మాన్ ఖాన్... చిరంజీవికి సోదరుడిగా నటించినట్టు తెలుస్తోంది. 

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ పై రామ్ చరణ్, ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్ సంగీతం అందించాడు. ఇటీవల వచ్చిన 'గాడ్ ఫాదర్' ట్రైలర్ మెగా ఫ్యాన్స్ ను విశేషంగా అలరిస్తోంది.

More Telugu News