varanasi: మ‌హిళ‌లు న‌వ‌రాత్రుల్లో ఉప‌వాసం ఉండే బ‌దులు రాజ్యాంగం చ‌ద‌వాల‌న్న లెక్చ‌ర‌ర్.. విధుల నుంచి తొల‌గింపు

  • వార‌ణాసి విశ్వ‌విద్యాల‌యం ప‌రిధిలో ఘ‌ట‌న‌
  • లెక్చ‌ర‌ర్‌పై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవ‌డంపై భిన్నాభిప్రాయాలు
  • క్యాంప‌స్ లోకి రాకుండా లెక్చ‌ర‌ర్ పై నిషేధం
Varanasi University Lecturer Navratra Post Gets Him Sacked

వార‌ణాసి విశ్వ‌విద్యాల‌యానికి చెందిన ఓ గెస్ట్ లెక్చ‌ర‌ర్ దేవీ న‌వ‌రాత్రుల్లో మ‌హిళ‌ల ఉప‌వాసం గురించి వివ‌దాస్ప‌ద కామెంట్లు చేసి ఉద్యోగాన్ని కోల్పోయాడు. విశ్వ‌విద్యాల‌యం ప‌రిధిలోని మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠ్‌లోని అతిథి అధ్యాపకుడిగా ప‌ని చేస్తున్న ఆ వ్య‌క్తిపై  క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంపై వివాదం చెలరేగింది. హిందువుల పండుగ అయిన‌ న‌వ‌రాత్రుల్లో మహిళలు పాల్గొనకూడదని గెస్ట్ లెక్చ‌ర‌ర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాజనీతి శాస్త్ర విభాగంలో గెస్ట్ లెక్చరర్ అయిన డాక్టర్ మిథిలేష్ కుమార్ గౌతమ్ "మహిళలు నవరాత్రులలో తొమ్మిది రోజులు ఉపవాసం ఉండే బ‌దులు భారత రాజ్యాంగం, హిందూ కోడ్ బిల్లును చదవడం మంచిది. వారి జీవితాలు భయం, బానిసత్వం నుంచి విముక్తి పొందుతాయి. జై భీమ్." అని హిందీలో ట్వీట్ చేశారు.  

ఈ కార‌ణంగా ఆ లెక్చ‌ర‌ర్ ను స‌ర్వీస్ నుంచి తొల‌గించారు. క్యాంప‌ప్ లోకి రాకుండా నిషేధం విధించారు. కొంతమంది విద్యార్థులు ఈ చర్యను సమర్థించారు. హిందు దేవుళ్ల‌ను, మ‌హిళ‌ల‌ను అవ‌మానించిన అత‌నిపై చ‌ర్యలు సరైన‌వే అంటున్నారు. మ‌రికొంద‌రు మాత్రం దీన్ని త‌ప్పుబ‌ట్టారు. లెక్చరర్ దళితుడు కాబ‌ట్టే బలిపశువును చేశారని ఆరోపించారు. కాగా, డాక్టర్ గౌతమ్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సునీతా పాండే తెలిపారు. ఏ మతంపైనా, మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే హక్కు ఎవరికీ లేదని అన్నారు. ఉపాధ్యాయుడు ఎప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలన్నారు. దీనిపై విద్యార్థులు ఫిర్యాదు చేశార‌న్నారు. ఈ విష‌యంపై విద్యార్థులు ఆగ్ర‌హంగా ఉండ‌టంతో భద్రత దృష్ట్యా క్యాంపస్‌లోకి రావద్దని లెక్చ‌ర‌ర్ కు సూచించినట్లు ఆమె వివరించారు.

More Telugu News