Food: ఈ ఐదు ఆహార పదార్థాలతో మంచి నిద్ర మీ సొంతమంటున్న నిపుణులు

  • మంచి నిద్రతో అద్భుతమైన శారీరక, మానసిక ఆరోగ్యం సమకూరుతుందని నిపుణుల వెల్లడి
  • వాల్ నట్స్, పుల్లని చెర్రీలు, ఓట్స్‌ తో ప్రయోజనం ఉంటుందని వివరణ
  • సాల్మన్‌ చేపలు, పాల ఉత్పత్తులతోనూ మంచి నిద్రకు తోడ్పాటు
  • రాత్రిళ్లు టీవీ, సెల్‌ ఫోన్‌, కంప్యూటర్ల వినియోగం తగ్గించాలని సూచన
Five foods that help you sleep better

ఎంత జాగ్రత్తగా ఆహారం తీసుకున్నా, పరిశుభ్రత విషయంలో ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా శరీరానికి తగిన విశ్రాంతి లేకపోతే ఆరోగ్యం బాగుండదు. సరైన నిద్రతోనే, అదీ అవసరమైనంత సమయం ఉంటేనే శరీరానికి తగినంత విశ్రాంతి లభిస్తుందని.. అలసట నుంచి పునరుత్తేజం పొందుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. మనం చేసే పనులతోపాటు తీసుకునే ఆహారం కూడా మన నిద్రపై ప్రభావం చూపుతుందని గుర్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి అమెరికాలోని న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌ నిపుణులు మోనిక్‌ రిచర్డ్‌ పలు సూచనలు చేశారు. మనకు మంచి నిద్ర కోసం కొన్ని రకాల ఆహార పదార్థాలు బాగా తోడ్పడుతాయని వివరించారు.

1. సాల్మన్‌ చేపలు
కొవ్వు, నూనె పదార్థాలు ఎక్కువగా ఉండే సాల్మన్‌ వంటి చేపలు (ఫ్యాటీ, ఆయిలీ ఫిష్‌) తీసుకోవడం వల్ల మంచి నిద్రకు వీలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్‌ డి ఎక్కువగా ఉంటాయని.. అవి శరీరంలో సెరొటోనిన్‌ హార్మోన్‌ ఉత్పత్తికి తోడ్పడుతాయని వివరిస్తున్నారు. ఈ హార్మోన్‌ మనలో ఉత్సాహాన్ని, సంతోషకరమైన భావనను కలిగించడంతోపాటు మంచి నిద్రకు ఉపకరిస్తుందని పేర్కొంటున్నారు.

2. పుల్లని చెర్రీలు (టార్ట్‌ చెర్రీలు)
మనలో మంచి నిద్రకు కారణమయ్యే మెలటోనిన్‌ హర్మోన్‌ ఉత్పత్తిని పెంచే లక్షణం టార్ట్‌ చెర్రీలలో ఉందని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట భోజనంలో భాగంగా టార్ట్‌ చెర్రీలను తీసుకోవడం వల్ల మెలటోనిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి పెరిగి.. మంచి నిద్రకు శరీరం సిద్ధమవుతుందని వివరిస్తున్నారు. వీటిని నేరుగా తినలేకపోతే జ్యూస్‌ చేసుకుని తాగవచ్చని సూచిస్తున్నారు.

3. వాల్‌ నట్స్‌ (ఆక్రోట్లు)
చేపల తర్వాత ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా లభించే ఆహారం వాల్‌ నట్స్‌ (ఆక్రోట్లు). మన జీవ గడియారం (సర్కాడియన్‌ రిథమ్‌ క్లాక్‌ - అంటే మన నిద్ర, మెలకువ, ఇతర జీవక్రియల సమయాలను నియంత్రించే అంతర్గత ఏర్పాటు) సరిగా పనిచేసేందుకు ఇవి వీలు కల్పిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

4. ఓట్స్‌
ఓట్స్‌లో ట్రిప్టోఫాన్‌ అనే అమైనో యాసిడ్‌ శాతం ఎక్కువగా ఉంటుందని.. ఇది మన శరీరంలో మెలటోనిన్‌, సెరటోనిన్‌ హార్మోన్లు తగిన స్థాయిలో ఉత్పత్తి అయ్యేందుకు తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి మంచి నిద్రకు కారణమవుతాయని వెల్లడిస్తున్నారు.

5. పాల ఉత్పత్తులు
పాలు, పెరుగు, మజ్జిగ వంటి డెయిరీ ఉత్పత్తులలో విటమిన్‌ డి, సి, బీ6, బీ12, క్యాల్షియంలతోపాటు శరీరం విశ్రాంతి పొందేందుకు కీలకమైన మెగ్నీషియం వంటివి పాల పదార్థాల్లో ఎక్కువగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇవన్నీ మంచి నిద్రకూ తోడ్పడుతాయని అంటున్నారు. ఇక పండ్లు, గుమ్మడి, సబ్జ వంటి గింజల్లోని పోషకాలు కూడా నిద్రకు ఉపకరిస్తాయని వివరిస్తున్నారు.

సాధారణంగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

  • కొన్నిరకాల ఆహార పదార్థాలు రాత్రిపూట నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా కొవ్వు, ఉప్పు, మసాలాలు ఎక్కువగా ఉండేవి ఇబ్బందికరంగా పరిణమిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
  • మాంసాహారం, పిజ్జాలు, ఫాస్ట్‌ ఫుడ్‌, ప్రాసెస్‌ చేసిన ఆహారం, కేకులు, రెడీ టు ఈట్‌ ప్యాకేజ్డ్‌ ఆహారం వంటివి నిద్ర నాణ్యతను దెబ్బతీస్తాయని వివరిస్తున్నారు.
  • ఆల్కహాల్‌ తీసుకున్నవారు వేగంగా నిద్రలోకి జారిపోయినా.. ఆ నిద్ర నాణ్యత తక్కువని, మెదడుకు పూర్తి విశ్రాంతి ఉండదని నిపుణులు చెబుతున్నారు. అందువల్లే మరునాడు నిద్ర లేచాక కూడా అలసటగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
  • కెఫైన్‌ ఎక్కువగా ఉండే కాఫీలు, కూల్‌ డ్రింకులు, చాక్లెట్లతోనూ నిద్రకు ఇబ్బంది ఉంటుందని వివరిస్తున్నారు.
  • ఇక చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలతో కలత నిద్రకు అవకాశం ఎక్కువని.. అదే ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఆహారంతో ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
  • తగినంత స్థాయిలో నీళ్లు తాగడం, రాత్రిపూట టీవీ, సెల్‌ ఫోన్‌ చూడటాన్ని తగ్గించడం, నిద్రపోయే గది వాతావరణం చల్లగా, అనుకూలంగా ఉండటం, పడక సౌకర్యవంతంగా సిద్ధం చేసుకోవడం, మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండటం వంటివి మంచి నిద్రకు అత్యంత కీలకమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

More Telugu News