money: డబ్బు మీ కోసం పనిచేయాలంటే.. మీరు ఇవి చేయాల్సిందే

  • ప్రతి లక్ష్యానికీ విడిగా ప్రణాళిక అవసరం
  • ఆర్జించే మొత్తంలో 40 శాతం పెట్టుబడులకు మళ్లించాలి
  • అత్యవసర నిధి, జీవిత బీమా, రిటైర్మెంట్ కు ప్రాధాన్యం ఇవ్వాలి
money works for you need to do these

డబ్బుకు ఉండే విలువ ఏపాటిదో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. అలాంటిది ఓ కుటుంబాన్ని నడిపించే వ్యక్తి డబ్బు విషయంలో ఎంత బాధ్యతాయుతంగా, క్రమశిక్షణగా ఉండాలి..?. క్రమశిక్షణ, పొదుపు, పెట్టుబడుల ప్రణాళిక లేకపోతే ఎంత సంపాదించినా ప్రయోజనం ఉండదు. ఆర్థిక ప్రణాళికకు జీవితంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. 

జీవితంలో ఎన్నో రకాల ఆర్థిక ప్రణాళికలు అవసరం. పన్ను ఆదా కోసం, పన్ను చెల్లింపుల ప్లానింగ్, సొంతింటి కోసం ప్లానింగ్, రిటైర్మెంట్ తర్వాతి జీవితానికి ప్లానింగ్, సమాజ సేవకు ప్లానింగ్, పిల్లల విద్యావసరాల కోసం ప్లానింగ్, పెట్టుబడులకు ప్లానింగ్, ఇన్సూరెన్స్ ప్లానింగ్, బడ్జెట్ ప్లానింగ్ ఇవన్నీ ప్రతి ఒక్కరికీ అవసరం. వీటిని నెరవేర్చుకునేందుకు ఎవరికివారు విడిగా ఒక సమగ్రమైన ప్రణాళిక రచించుకుని, దాని ప్రకారం నడుచుకోవాలి.

ముఖ్యంగా సంపాదించిన దాంట్లో కనీసం 30-40 శాతం అయినా ఆదా చేయాలి. వచ్చే ఆర్జన నుంచి ఈ మొత్తాన్ని ముందుగానే పక్కన పెట్టేయాలి. 40 శాతం వరకు నీడ్స్ (అవసరాలు) కోసం ఖర్చు చేయాలి. మిగిలిన కోర్కెలకు 20 శాతం కేటాయించుకోవాలి. పైన చెప్పుకొన్నట్టు ప్రతి లక్ష్యానికీ విడిగా ఒక ప్రణాళిక ఉండాల్సిందే. నేటి జీవన అవసరాలకు అవుతున్న వ్యయం ఆధారంగా రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా ఎంత మొత్తం కావాల్సి ఉంటుందన్న అంచనా ఆధారంగా పెట్టుబడి ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇలా ప్రతి ఒక్క లక్ష్యానికీ ప్రత్యేకమైన ప్రణాళికతో అడుగులు వేస్తే వాటిని సాధించడం సులభం అవుతుంది. 

రుణాలకు దూరంగా ఉండాలి. తప్పనిసరి, అత్యవసర పరిస్థితుల్లో రుణాలను పరిశీలించొచ్చు. రుణం తీసుకునే ముందు ప్రతి నెలా చెల్లింపులకు వీలుగా వెసులుబాటు ఉందేమో చూసుకోవాలి. లేదంటే సమస్యలు ఎదురవుతాయి. సకాలంలో చెల్లించలేకపోతే రుణ చరిత్రపై మచ్చ పడుతుంది. 

దీర్ఘకాల లక్ష్యాలకు సంబంధించి పెట్టుబడుల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. కనీసం ఐదేళ్లకు పైన కాలానికే ఈక్విటీ ఫండ్స్ పథకాలు అనుకూలం. స్వల్పకాల అవసరాల కోసం డెట్ సాధనాలే అనువైనవి. అలాగే, అత్యవసర నిధిని కూడా నిర్వహించక తప్పదు. ఆర్జించే వ్యక్తి తన పేరిట కనీసం 12-18 నెలల అవసరాలకు సరిపడే నిధిని సిద్ధంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా జీవిత బీమా, ఆరోగ్య బీమాలకు తప్పకుండా చోటు కల్పించుకోవాలి.

More Telugu News