Taj Mahal: తాజ్ మహల్ షాజహాన్ కట్టించలేదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్

  • తాజ్ మహల్ ను షాజహాన్ నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు లేవన్న పిటిషనర్
  • 1631 నుంచి 1653 వరకు తాజ్ ను నిర్మించినట్టు శాస్త్రీయ ఆధారాలు లేవని వాదన
  • తాజ్ నిర్మాణంపై స్పష్టతనివ్వాలని సుప్రీంకోర్టును కోరిన వైనం
Petition in supreme court seeking clarification on Taj Mahal

తాజ్ మహల్ నిర్మాణంపై స్పష్టతనిచ్చి, వివాదాలకు తెర దించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. డాక్టర్ రజనీశ్ సింగ్ అనే వ్యక్తి ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. తాజ్ మహల్ ను షాజహాన్ నిర్మించినట్టు చెపుతున్నప్పటికీ దానికి చారిత్రక ఆధారాలు లేవని పిటిషన్ లో ఆయన తెలిపారు. ముంతాజ్ కోసం షాజహాన్ 1631 నుంచి 1653 వరకు 22 ఏళ్ల పాటు తాజ్ మహల్ ను నిర్మించారని చెపుతున్నప్పటికీ దానికి తగిన శాస్త్రీయ ఆధారాలు లేవని చెప్పారు. 

ఇదే అంశంపై క్లారిటీ కోసం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసర్చ్ అండ్ ట్రైనింగ్ కు సమాచారం హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశానని... అయితే, ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్ మహల్ నిర్మించినట్టు ప్రాథమిక ఆధారాలు అందుబాటులో లేవని సమాధానం వచ్చిందని పిటిషనర్ తెలిపారు. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా తన ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానాన్ని ఇవ్వలేదని చెప్పారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

More Telugu News