Joe Biden: నాటో పరిధిలో ప్రతి అంగుళం భూభాగాన్ని కాపాడుకుంటాం: రష్యాకు హెచ్చరికలు చేసిన బైడెన్

  • అణు బెదిరింపులకు దిగుతున్న రష్యా
  • తీవ్రంగా పరిగణిస్తున్న అమెరికా
  • పుతిన్ బెదిరింపులకు భయపడబోమన్న బైడెన్
  • పూర్తి సన్నద్ధంగా ఉన్నామని వెల్లడి
Biden warns Putin amidst Russia nuclear threats

రష్యా ఇటీవల పదేపదే అణు బెదిరింపులకు దిగుతుండడం, తాజాగా ఉక్రెయిన్ కు చెందిన నాలుగు ప్రాంతాలు ఇక తనవేనంటూ పుతిన్ అధికారికంగా ప్రకటన చేసిన నేపథ్యంలో అమెరికా వర్గాలు స్పందించాయి. 

పుతిన్ అణు బెదిరింపులను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ తెలిపారు. అయితే పుతిన్ అణుయుద్ధానికి దిగే సూచనలేవీ కనిపించడంలేదని వెల్లడించారు. వైట్ హౌస్ లో సలివాన్ మీడియాతో మాట్లాడుతూ, ఈ అంశంపై రష్యాతో అమెరికా నేరుగా చర్చిస్తోందని వివరించారు. ఒకవేళ రష్యా అణుయుద్ధానికి దిగితే అమెరికా స్పందన ఎలా ఉంటుందో కూడా స్పష్టం చేశామని తెలిపారు. 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ... పుతిన్ బెదిరింపులకు అమెరికా, నాటో భాగస్వాములు భయపడబోవని అన్నారు. పుతిన్ అలాంటి చర్యలకు దిగబోవడంలేదని తెలిపారు. నాటో పరిధిలోని ప్రతి అంగుళం భూభాగాన్ని పరిరక్షించుకునేందుకు ఇతర భాగస్వాములతో కలిసి అమెరికా పూర్తి సన్నద్ధతతో ఉందని బైడెన్ స్పష్టం చేశారు. "ప్రతి అంగుళం అని ఎందుకు అంటున్నానో సరిగా అర్థమవుతోందా మిస్టర్ పుతిన్?" అంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. 

కాగా, ఉక్రెయిన్ లోని జపోర్జియా, ఖేర్జన్, డోనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను విలీనం చేసుకుంటున్నట్టు నిన్న పుతిన్ శాసనం చేయడం తెలిసిందే. ఈ ప్రాంతాలు ఇక తమవేనని, ఈ నాలుగు ప్రాంతాల్లో ఎక్కడ దాడి చేసినా రష్యాపై దాడి చేసినట్టేనని పుతిన్ స్పష్టం చేశారు. 

దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్ స్కీ స్పందించారు. తమను నాటోలో చేర్చుకునే ప్రక్రియను వేగవంతం చేయాలంటూ తాజాగా దరఖాస్తు చేసుకున్నారు.

More Telugu News