Tiger: మనుషుల్ని వేటాడడమే పనిగా పెట్టుకున్న పులి.. రంగంలోకి హైదరాబాద్ షూటర్

  • బీహార్‌లోని ‘వాల్మీకి టైగర్ రిజర్వ్’ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను వణికిస్తున్న పులి
  • 150 మంది అటవీ అధికారులు కాపుకాసినా ఫలితం శూన్యం
  • నెల రోజుల్లో ఐదుగురిని పొట్టన పెట్టుకున్న వైనం
  • హైదరాబాద్ షార్ప్ షూటర్ నవాబ్‌కు పిలుపు
  • అందరూ చూస్తుండగానే బోనులోని మేకను ఎత్తుకెళ్లిన వ్యాఘ్రం
Hyderabad shooter in Bihar to capture man eater Royal Bengal tiger

మనిషి రక్తం రుచి మరిగిన ఓ రాయల్ బెంగాల్ టైగర్ ప్రజలను వణికిస్తోంది. ఎప్పుడు, ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందో తెలియక ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని బతుకుతున్నారు. దానిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి దాని పొగరు అణచేందుకు హైదరాబాద్ షార్ప్ షూటర్ నవాబ్ షఫత్ అలీఖాన్‌ రంగంలోకి దిగారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలోని బగహాలో ఉన్న ‘వాల్మీకి టైగర్ రిజర్వ్’ (వీటీఆర్)లోని ఓ పులి పరిసర గ్రామాల ప్రజలను నిద్రకు దూరం చేస్తోంది. మనిషి రక్తం రుచి మరిగిన ఈ పులి నెల రోజుల్లో ఐదుగురి ప్రాణాలు తీసింది.

దీంతో వీటీఆర్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయపడిపోతున్నారు. ఈ పులిని పట్టుకుని బంధించేందుకు అటవీశాఖ రెస్క్యూ సిబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. స్థానిక బైరియా కాలా గ్రామం కేంద్రంగా నిపుణుల సాయంతో దాని ఆచూకీని కనుగొనేందుకు అటవీ అధికారులు నానా కష్టాలు పడుతున్నారు. అయినప్పటికీ అది చిక్కడం లేదు సరికదా తాజాగా, అది తన స్థావరాన్ని మార్చుకుని హరిహర్‌పూర్ గ్రామంలోని చెరకు తోటల్లోకి చేరుకుంది.

దీంతో గ్రామస్థుల భయం మరింత ఎక్కువైంది. పులిని పట్టుకునేందుకు నాలుగు ఏనుగులను రప్పించినా ఫలితం లేకుండా పోయింది. 150 మంది అధికారులు, సిబ్బంది ఇప్పుడు దానిని పట్టుకునే పనిలోనే నిమగ్నమైనా అది వారి కంటపడకుండా తప్పించుకు తిరుగుతోంది. దీంతో ఇక లాభం లేదని భావించిన అధికారులు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ షూటర్ నవాబ్ షఫత్ అలీఖాన్‌కు కబురందించారు. వెంటనే ఆయన రంగంలోకి దిగిపోయారు. పులిని పట్టుకునేందుకు గురువారం ఓ మేకను బోనులో పెట్టి కాపుకాశారు. తెల్లవారుజామున బోను వద్దకు వచ్చిన పులి అందరూ చూస్తుండగానే మేకను నోట కరుచుకుని ఎత్తుకెళ్లిపోయింది.

More Telugu News