Vladimir Putin: ఉక్రెయిన్ లో ఆక్రమించుకున్న నాలుగు ప్రాంతాలతో రష్యా భూభాగాన్ని విస్తరిస్తూ పుతిన్ అధికారిక ప్రకటన

  • గత 7 నెలలుగా ఉక్రెయిన్ పై రష్యా దాడులు
  • నాలుగు ప్రాంతాలు తనవేనని రష్యా వెల్లడి
  • రిఫరెండం నిర్వహించామన్న పుతిన్
  • ప్రజాభిప్రాయం తమవైపే ఉందని వెల్లడి
  • మండిపడుతున్న ఉక్రెయిన్
Putin annexes Russia with four regions

ఉక్రెయిన్ పై ఫిబ్రవరి 24 నుంచి దాడులు కొనసాగిస్తున్న రష్యా తన వైఖరిని ఇన్నాళ్లకు బయటపెట్టింది. ఉక్రెయిన్ లో ఆక్రమించుకున్న నాలుగు ప్రాంతాలు ఇక తమవేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. రష్యాలో నాలుగు కొత్త ప్రాంతాలు చేరాయని వెల్లడించారు. 

జపోర్జియా, ఖేర్సన్, లుహాన్స్క్, డోనెట్స్క్ ప్రాంతాలతో  కలిపి రష్యా భూభాగాన్ని విస్తరిస్తున్నట్టు పుతిన్ అధికారిక ప్రకటన చేశారు. ఈ ప్రాంతాలపై దాడి చేస్తే అది రష్యాపై జరిగిన దాడిగానే పరిగణిస్తామని హెచ్చరించారు. 

కాగా, ఈ ప్రాంతాల్లో తాము రిఫరెండం జరిపినట్టు రష్యా చెబుతోంది. అయితే, ఉక్రెయిన్ ప్రభుత్వం, పాశ్చాత్య దేశాల ప్రభుత్వాలు ఈ రిఫరెండంలను ఖండిస్తున్నాయి. ఇది అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమేనని, ప్రజలతో బలవంతంగా రిఫరెండంలో పాల్గొనేట్టు చేశారని, ఏకపక్షంగా రిఫరెండం చేపట్టారని ఆరోపించాయి. 

అయితే, పుతిన్ మాత్రం ప్రజాభిప్రాయం తమకే అనుకూలంగా ఉందని, వారు రష్యాలో కలిసేందుకే మొగ్గుచూపారని తెలిపారు. ఈ క్రమంలో ఆయన ఐక్యరాజ్యసమితి నియమావళి ఆర్టికల్-1ను కూడా ఉదహరించారు.

More Telugu News