Women: మంచు ఖండంలోనూ మహిళలకు లైంగిక వేధింపులు

  • అంటార్కిటికాలో ఆస్ట్రేలియా పరిశోధన క్యాంపులు
  • మహిళా సిబ్బంది పట్ల అనుచిత ప్రవర్తన
  • ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ఫిర్యాదులు
  • తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం
Harassment on women at Australian camps in Antarctica

మంచు ఖండం అంటార్కిటికాలో అనేక దేశాలు పరిశోధనలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఆయా దేశాలు అంటార్కిటికాలో క్యాంపులు ఏర్పాటు చేసుకుని ఆయా అంశాలపై అధ్యయనాలు చేపడుతున్నాయి. ఆస్ట్రేలియా కూడా ఈ మంచు ఖండంలో భారీస్థాయిలో పరిశోధకులను రంగంలోకి దించింది. కాసే, డేవిస్, మాసన్ పేరిట మూడు రీసెర్చ్ స్టేషన్లు నిర్వహిస్తోంది. 

అయితే, అంటార్కిటికాలోని ఆస్ట్రేలియా క్యాంపుల్లో మహిళలపై తీవ్రస్థాయిలో లైంగిక వేధింపులు చోటుచేసుకుంటున్న విషయం వెలుగులోకి వచ్చింది. మహిళా సిబ్బందిని అభ్యంతరకరంగా తాకడం, శృంగారంలో పాల్గొనాలంటూ ఆహ్వానాలు, గోడలపై అశ్లీల చిత్రాలు, రాతలు, వెకిలి చేష్టలు ఆస్ట్రేలియా క్యాంపుల్లో నిత్యకృత్యాలు గా మారినట్టు ఆరోపణలు వచ్చాయి. 

అంతేకాదు, ఇక్కడ మహిళలకు అందించే నెలసరి ప్యాడ్లు కూడా పరిమితంగానే ఉండడంతో, మహిళా సిబ్బంది తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం కూడా తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారాలపై ఆస్ట్రేలియా ప్రభుత్వానికి పలువురు మహిళా సిబ్బంది ఫిర్యాదు చేశారు. 

దీనిపై ఆస్ట్రేలియా పర్యావరణ శాఖ మంత్రి తాన్యా పిల్బెర్సెక్ స్పందించారు. ఆస్ట్రేలియా అంటార్కిటిక్ డివిజన్ (ఏఏడీ) స్వతంత్ర దర్యాప్తులో వెల్లడైన విషయాలు తనను దిగ్భ్రాంతికి గురిచేశాయని తెలిపారు. ఏ కార్యాలయంలోనూ మహిళలు లైంగిక వేధింపులకు గురికావడాన్ని తాను సహించబోనని తాన్యా పిల్బెర్సెక్ స్పష్టం చేశారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినవారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

More Telugu News