T20 World Cup: ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ విజేతకు ఎంత ప్రైజ్ మనీ ఇస్తారో తెలుసా..?

  • అక్టోబరు 16 నుంచి టీ20 వరల్డ్ కప్
  • ఈసారి మెగా ఈవెంట్ కు ఆస్ట్రేలియా ఆతిథ్యం
  • విజేతగా నిలిచిన జట్టుకు రూ.13 కోట్లు
  • రన్నరప్ కు రూ.6.5 కోట్లు
  • సెమీఫైనల్లో ఓడిన జట్లకు రూ.3.26 కోట్లు
T20 World Cup prize money details

అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ టోర్నీలో విజేతకు అందించే ప్రైజ్ మనీ వివరాలను ఐసీసీ నేడు ప్రకటించింది. టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు రూ.13 కోట్ల పారితోషికం ఉంటుందని ఐసీసీ వెల్లడించింది. రన్నరప్ గా నిలిచిన జట్టుకు రూ.6.5 కోట్లు ఇస్తారు. 

ఇక, సెమీఫైనల్లో ఓడిన జట్లకు రూ.3.26 కోట్లు, సూపర్-12 దశలో వెనుదిరిగిన జట్లకు రూ.56 లక్షలు ఇవ్వనున్నారు. తొలి రౌండ్ లో ఓడిన జట్లకు రూ.32 లక్షలు అందించనున్నారు. ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. 

ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు తలపడనున్నాయి. కాగా, 8 జట్లు సూపర్-12 దశలోకి నేరుగా అడుగుపెడతాయి. ఆ జట్లు ఏవంటే... టీమిండియా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్. 

ఇక... శ్రీలంక, యూఏఈ, నమీబియా, నెదర్లాండ్స్, వెస్టిండీస్, స్కాట్లాండ్, ఐర్లాండ్, జింబాబ్వే జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి తొలి రౌండ్ పోటీలు ఆడతాయి. ఈ రెండు గ్రూపుల నుంచి నాలుగు జట్లు సూపర్-12 దశకు చేరుకుంటాయి. ఈ సూపర్-12 దశలో మెరుగైన ప్రదర్శన కనబర్చిన 4 జట్లు సెమీస్ లో అడుగుపెడతాయి.

More Telugu News