Murder: ప్రియుడితో కలిసి తండ్రిని చంపేసిన కుమార్తె.. సహకరించిన తల్లి!

  • హత్యగా నమ్మించే ప్రయత్నం చేసిన తల్లి, కుమార్తె
  • హత్యకు ముందు 'దృశ్యం' సినిమాను పలుమార్లు చూసిన వైనం
  • తన భర్తను ఎవరో హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు
  • విచారణలో తల్లీకుమార్తెలు ఇద్దరూ ఒకే రకమైన సమాధానం
  • అనుమానంతో ఫోన్ కాల్స్ చెక్ చేయడంతో బయటపడిన అసలు నిజం
Daughter with the help of mother and lover killed father in Karnataka

తన ప్రేమను అంగీకరించని తండ్రిని ప్రియుడితో కలిసి హత్య చేసి అడ్డు తొలగించుకోవాలని చూసిందో కూతురు. ఆమెకు తల్లి కూడా సహకరించింది. అనుకున్నట్టే ప్రియుడిని పిలిపించి హత్యచేశారు. ఆపై ‘దృశ్యం’ సినిమాలోలా తల్లీకూతుళ్లు ఇద్దరూ ఒకేరకమైన సమాధానాలు ఇస్తుండడంతో అనుమానం వచ్చిన పోలీసులు వారి ఫోన్ కాల్స్‌ను పరిశీలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని బెళగావిలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన సుధీర్ కాంబళె (57), రోహిణి భార్యాభర్తలు. వీరికి స్నేహ అనే కుమార్తె ఉంది. గతంలో దుబాయ్‌లో పనిచేసిన సుధీర్ కరోనా తర్వాత నగరానికి చేరుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు. పూణెలో హోటల్ మేనేజ్‌మెంట్ చదువుతున్న సమయంలో స్నేహకు అక్షయ్ విఠకర్ అనే యువకుడు పరిచయమయ్యాడు. అది క్రమంగా ప్రేమగా మారింది. కుమార్తె ప్రేమ విషయాన్ని గుర్తించిన తండ్రి సుధీర్ ఆమెను మందలించాడు.

తండ్రి మందలించడంతో తమ ప్రేమ సఫలం కాదని భావించిన స్నేహ ఆయనను అడ్డు తొలగించుకోవాలని భావించింది. విషయం తల్లి రోహిణికి చెబితే ఆమె కూడా సరేనంది. దీంతో ప్రియుడితో కలిసి తండ్రి హత్యకు స్నేహ ప్లాన్ చేసింది. అందులో భాగంగా ఈ నెల 15న అక్షయ్‌ను నగరానికి రప్పించి ఓ లాడ్జీలో ఉంచింది. 

16న రాత్రి తండ్రి పైఅంతస్తులో నిద్రించగా 17న తెల్లవారుజామున తల్లీకుమార్తెలు అక్షయ్‌ను ఇంటికి పిలిపించారు. తల్లీకూతుళ్లు ఇద్దరూ సుధీర్ కాళ్లు చేతులు పట్టుకోగా అక్షయ్ కత్తితో ఇష్టానుసారం పొడిచి చంపేశాడు. అనంతరం అక్షయ్ పూణె వెళ్లిపోయాడు. ఆ తర్వాత తన భర్త హత్యకు గురయ్యాడంటూ రోహిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు తల్లీకుమార్తెలను ప్రశ్నించారు. 

దృశ్యం సినిమా ప్రభావం
విచారణలో వారిద్దరూ ఒకే రకమైన సమాధానాలు చెబుతుండడంతో అనుమానం వచ్చి వారి ఫోన్ కాల్స్‌ను పరిశీలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో గట్టిగా గద్దించగా హత్య చేసింది తామేనని అంగీకరించారు. ఇద్దరూ ఒకేరకంగా సమాధానాలు చెప్పేందుకు దృశ్యం సినిమాను పలుమార్లు చూసినట్టు చెప్పారు. నిందితులు రోహిణి, స్నేహ, అక్షయ్‌లు ముగ్గురినీ అరెస్ట్ చేసిన పోలీసులు కటకటాల వెనక్కి పంపారు.

More Telugu News