Alice: ఇది పూర్తిగా విద్యుత్ తో నడిచే విమానం... ప్రపంచంలో మొట్టమొదటిది!

  • గాల్లోకి ఎగిరిన 'ఆలిస్'
  • తొలి గగనవిహారం విజయవంతం
  • ఆలిస్ ను అభివృద్ధి చేసిన ఈవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్
  • ఇప్పటికే పలు సంస్థల నుంచి ఆర్డర్లు
Alice the fully electric plane completes first flight successfully

పర్యావరణ హిత ఇంధన వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా చైతన్యం వస్తోంది. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు కాలుష్య రహిత విధానాల పట్ల ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇందులో భాగంగానే విద్యుత్ ఆధారిత వాహనాలను రూపొందిస్తూ భవిష్యత్ లో స్వచ్ఛమైన వాతావరణానికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. 

కార్లు, బస్సులు, స్కూటర్లు... ఇలా విద్యుచ్ఛక్తితో రోడ్డుపై నడిచే వాహనాలే కాదు, గాల్లో దూసుకెళ్లే విమానాలు కూడా తయారవుతున్నాయి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఓ విమానం విద్యుత్ శక్తిని వినియోగించుకుని గాల్లోకి ఎగిరింది. ఈ విమానం పేరు 'ఆలిస్'. 

ఇటీవలే ఇది విజయవంతంగా తొలి గగనవిహారం చేసింది. అమెరికాలోని గ్రాంట్ కౌంటీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో టెస్ట్ ఫ్లయిట్ చేపట్టారు. గాల్లో 3,500 అడుగుల ఎత్తులో 8 నిమిషాల పాటు గగనయానం చేసింది. ఇది పూర్తిగా కరెంటుతో నడిచే విమానం. 

దీన్ని ఈవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. ఇది గరిష్ఠంగా 260 నాట్ల వేగంతో ప్రయాణిస్తుంది. తేలికపాటి జెట్ విమానాలు, హైఎండ్ టర్బోప్రాప్ విమానాల ఖర్చుతో పోల్చితే 'ఆలిస్' ప్రయాణానికి అయ్యే ఖర్చు (ఒక గంటకు) ఎంతో తక్కువ అని ఈవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ చెబుతోంది. 

ఇందులో 6 సీట్లతో ఎగ్జిక్యూటివ్ క్యాబిన్, 9 సీట్లతో కమ్యూటర్, ఈ-కార్గో పేరిట మూడు వేరియంట్లు ఉన్నాయి. 'ఆలిస్' అన్ని మోడళ్లలో ఇద్దరు పైలెట్లు ఉంటారు. 

కాగా, ఇప్పటికే 'ఆలిస్' కోసం ఆర్డర్లు వేచిచూస్తున్నాయి. అమెరికాకు చెందిన కేప్ ఎయిర్, గ్లోబల్ క్రాసింగ్ ఎయిర్ లైన్స్ సంస్థలు పదుల సంఖ్యలో 'ఆలిస్' విమానాల కోసం ఆర్డర్లు బుక్ చేశాయి. అంతేకాదు, ప్రఖ్యాత కార్గో సంస్థ డీహెచ్ఎల్ కూడా తమ సరకు రవాణా కోసం 12 ఆలిస్ ఈ-కార్గో మోడల్ విమానాల కోసం ఆర్డర్ చేసింది.

More Telugu News