Botsa Satyanarayana: రాష్ట్రానికి పనికిమాలిన ప్రతిపక్షం అవసరమా?: మంత్రి బొత్స

  • ఏపీకి టీడీపీ అవసరంలేదన్న బొత్స
  • ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం
  • వచ్చే ఎన్నికల్లో 175 సీట్లూ గెలుస్తామని ధీమా
  • మొత్తం సీట్లు గెలవాలనుకోవడం అత్యాశ కాదని వెల్లడి
Botsa comments on opposition party

ఇటీవలకాలంలో ఏపీ మంత్రులు  విపక్షంపై చేస్తున్న వ్యాఖ్యల్లో తీవ్రత కనిపిస్తోంది. తాజాగా, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా టీడీపీపై ధ్వజమెత్తారు. రాష్ట్రానికి పనికిమాలిన ప్రతిపక్షం అవసరమా? అని వ్యాఖ్యానించారు. ఏపీకి టీడీపీ అవసరంలేదని అన్నారు. 

మీడియాలో ఓ వర్గం తప్పుడు కథనాలను ప్రచారం చేస్తోందని బొత్స ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని, మొత్తం 175 సీట్లు గెలిచి సరికొత్త చరిత్ర సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే తమది అతి విశ్వాసం కాదని స్పష్టం చేశారు. 175 స్థానాలు గెలవాలనుకోవడం అత్యాశ కాదని మంత్రి తెలిపారు. 

ఇక, సమీక్ష సమావేశంలో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలందరికీ గెలుపే అంతిమలక్ష్యం కావాలని సీఎం జగన్ చెప్పారని బొత్స వెల్లడించారు. అయితే, ఒక స్థానం పోయినా ఫర్వాలేదు అనుకుంటే 10 స్థానాలు పోయే ప్రమాదం ఉందని, అందుకే ప్రతి ఎమ్మెల్యే గెలుపుపై గట్టిగా కృషి చేయాల్సి ఉంటుందని వివరించారు. ఒకవేళ నేతలకు వారసులు ఉంటే, వారిని బరిలో దింపేందుకు ప్రజల ఆమోదం కావాలి అని బొత్స అభిప్రాయపడ్డారు.

More Telugu News