TS DGP: టీఎస్ డీజీపీ వాహనంపై రూ.7 వేల చలానా పెండింగ్ అంటూ ప్రచారం.. పోలీసుల వివరణ ఇదే!

  • 2018 నుంచి పోలీస్ వాహనాలన్నీ డీజీపీ పేరిటే రిజస్టర్ అవుతున్నాయన్న జాయింట్ సీపీ రంగనాథ్
  • ఏ వాహనంపై చలానా విధించినా డీజీపీ పేరిటే వస్తుందని వివరణ
  • పోలీస్ వాహనాల చలానాలన్నింటినీ చెల్లించారన్న రంగనాథ్
Rs 7000 chalan on TS DGP

తెలంగాణ డీజీపీ వాహనంపై రూ. 7 వేల చలానా పెండింగ్ లో ఉందనే వార్త ట్విట్టర్ లో వైరల్ అయింది. ఆయన ఫైన్ చెల్లించారా? లేదా? అంటూ నెటిజెన్లు పెద్ద సంఖ్యలో కామెంట్లు చేశారు. ఈ అంశంపై ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ వివరణ ఇచ్చారు. తెలంగాణలోని పోలీస్ వాహనాలన్నీ 2018 నుంచి డీజీపీ పేరిట మాత్రమే రిజిస్టర్ అవుతున్నాయని ఆయన తెలిపారు. అందుకే ఏ పోలీస్ వాహనంపై ఫైన్ విధించినా డీజీపీ పేరిటే వస్తుందని చెప్పారు.

ఇప్పటివరకు పోలీసుల వాహనాలపై ఉన్న 11,601 చలానాలకు సంబంధించి రూ. 28.85 లక్షలను ఆయా అధికారులు చెల్లించారని తెలిపారు. ట్విట్టర్ లో వైరల్ గా మారిన రూ. 6,945 చలానాను కూడా సదరు అధికారి చెల్లించేశారని చెప్పారు. ఆర్టీసీ అధికారులు కూడా ఈ ఏడాది ఏప్రిల్ వరకు రూ. 15 లక్షల చలానా డబ్బులు చెల్లించారని తెలిపారు. ట్రాఫిక్ అధికారులు సైతం చట్టానికి కట్టుబడి ఉంటారని చెప్పారు.

More Telugu News