Germany: ఆర్థికమాంద్యంలోకి జారుకుంటున్న ఐరోపా ఆర్థిక దిగ్గజం జర్మనీ

  • 2008 నాటి ప్రపంచ ఆర్థికమాంద్యం స్థాయికి పడిపోయిన జర్మనీ వ్యాపార వృద్ధి సూచీ
  • డిమాండ్ లేక భారీగా నష్టపోతున్న పరిశ్రమలు
  • మూసివేత దిశకు చేరుకుంటున్న ఇంధన ఆధారిత వ్యాపారాలు
Gemany going towards slowdown

కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచాన్ని మరో విషయం వణికిస్తోంది. ప్రపంచం ఆర్థికమాంద్యంలోకి వెళ్లబోతోందని నిపుణులు చెపుతున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో ఆర్థికమాంద్యం సంకేతాలు కనిపిస్తున్నాయి. పలు దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. అమెరికా సైతం పెరుగుతున్న ఇన్ ఫ్లేషన్ తో సతమతమవుతోంది. 

మరోవైపు యూరప్ లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ ఆర్థికమాంద్యం కోరల్లోకి జారుకుంటోంది. ఆ దేశ వ్యాపార వృద్ధి సూచీ సెప్టెంబర్ లో 84.3కు పడిపోయింది. ఆగస్టు నెలలో ఇది 88.5 శాతంగా ఉంది. సెప్టెంబర్ గణాంకాలు 2008 నాటి ప్రపంచ ఆర్థికమాంద్యం స్థాయికి కుంగిపోవడం గమనార్హం.
   
పారిశ్రామిక ఉత్పత్తులకు డిమాండ్ లేక కంపెనీలు భారీగా నష్టపోతున్నాయి. ఇంధన, కమోడిటీ ధరలు పెరిగిపోవడంతో వ్యాపార కార్యకలాపాలు మందగించాయి. ఇంధన ఆధారిత వ్యాపారాలను మూసివేసే దిశకు చేరుకుంటున్నాయి. మరోవైపు ఈ ప్రభావం జర్మనీ నుంచి మొత్తం ఐరోపాకు విస్తరించే అవకాశం ఉంది. 


ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం యూరప్ పరిస్థితినే మార్చి వేసింది. ఈ యుద్ధానికి ముందు రష్యా నుంచి జర్మనీ తక్కువ ధరకే సహజవాయువును పొందేది. అయితే, రష్యా సైనిక చర్యను నిలువరించేందుకు ఆ దేశంపై యూరప్ దేశాలు ఆంక్షలను విధించాయి. రష్యా ఇందన దిగుమతులపై ఆంక్షలను విధించాయి. 

ఈ క్రమంలో రష్యా నుంచి సహజవాయువు ఆగిపోవడంతో... అమెరికా వంటి దేశాల నుంచి ఖరీదైన లిక్విఫైడ్ గ్యాస్ ను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. రష్యా నుంచి గ్యాస్ పైప్ లైన్ ద్వారా వస్తుండగా... ఇప్పుడు నౌకల ద్వారా రవాణా చేయించుకోవాల్సి వస్తోంది. దీంతో ధర మరింత పెరుగుతోంది. ఈ పరిణామాలన్నీ జర్మనీని ఆర్థికమాంద్యంలోకి నెట్టేస్తున్నాయి.

More Telugu News