Australia: ధాటిగా ఆడిన కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్... టీమిండియా టార్గెట్ 187 రన్స్

  • ఉప్పల్ మైదానంలో భారత్ వర్సెస్ ఆసీస్
  • టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కంగారూలు
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 186 రన్స్
  • అర్ధసెంచరీలు సాధించిన గ్రీన్, టిమ్ డేవిడ్
  • 3 వికెట్లు తీసిన అక్షర్ పటేల్
Aussies set 187 runs target to Team India

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో టీమిండియాతో చివరి టీ20లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్ అర్ధసెంచరీలతో అదరగొట్టారు. దాంతో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 186 పరుగులు చేసింది. 

ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన ఆసీస్ మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ గా బరిలో దిగిన ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ 21 బంతుల్లోనే 52 పరుగులు చేసి భారత్ శిబిరంలో ఆందోళన కలిగించాడు. గ్రీన్ ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 3 సిక్సులున్నాయి. అయితే గ్రీన్ ను భువనేశ్వర్ అవుట్ చేయడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. 

అంతకుముందే కెప్టెన్ ఫించ్ (7) ను అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. గ్రీన్ అవుటైన తర్వాత ఆసీస్ వడివడిగా వికెట్లు కోల్పోయింది. స్మిత్ 9, మ్యాక్స్ వెల్ 6 పరుగులు చేసి అవుటయ్యారు. అయితే టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్ (24) జోడీ ఆసీస్ ను ఆదుకుంది.

ముఖ్యంగా టిమ్ డేవిడ్ ఆఖరి ఓవర్లలో విజృంభించాడు. ఈ పొడగరి బ్యాట్స్ మన్ 27 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 2 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. దూకుడుగా ఆడే వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ (1) ఈ మ్యాచ్ లో విఫలమయ్యాడు. 

చివర్లో ఆల్ రౌండర్ డేనియల్ సామ్స్ (20 బంతుల్లో 28 నాటౌట్) ఉపయుక్తమైన ఇన్నింగ్స్ ఆడడంతో ఆసీస్ కు భారీ స్కోరు సాధ్యమైంది. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 3, భువనేశ్వర్ కుమార్ 1, యజువేంద్ర చహల్ 1, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు. 

అనంతరం, 187 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా ఆరంభంలోనే ఓపెనర్ కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్... డేనియల్ సామ్స్ బౌలింగ్ లో వికెట్ కీపర్ వేడ్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 13, కోహ్లీ 6 పరుగులతో ఆడుతున్నారు.

More Telugu News