China: చైనాలో సైనిక తిరుగుబాటు ఉత్తదేనట.. జిన్‌పింగ్ క్వారంటైన్‌లో ఉన్నారంటున్న నిపుణులు

  • అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను సైన్యం గృహ నిర్బంధం చేసిందని వార్తలు
  • అధికారాన్ని సైన్యం హస్తగతం చేసుకుందంటూ పుకార్లు
  • అలాంటిదేమీ లేదంటున్న చైనా నిపుణులు
  • ఆధారాలను పోస్టు చేసిన వైనం
 Is China Having A Coup And Is Xi Jinping Under House Arrest What experts have said

చైనాలో సైనిక తిరుగుబాటు జరిగిందని, అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను సైన్యం గృహ నిర్బంధం చేసిందని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వార్తలు పోటెత్తుతున్నాయి. ముఖ్యంగా భారత్ మీడియాలో ఓ రేంజ్‌లో వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తల్లో పస లేదని, సైనిక తిరుగుబాటు వార్తలు అన్నీ ఉత్తవేనని చైనా నిపుణులు చెబుతున్నారు. ఇండియాలోని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవి తేల్చి చెప్పారు.  

ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో)లో పాల్గొన్న జిన్‌పింగ్ స్వదేశం చేరుకున్న అనంతరం సైన్యం ఆయనను గృహ నిర్బంధంలోకి తీసుకుందన్న వార్తల్లో నిజం లేదని చైనా నిపుణుడు అదిల్ బ్రార్ కొట్టిపడేశారు. బహుశా జిన్‌పింగ్ క్వారంటైన్‌లో ఉండి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అలాగే, రాజధాని బీజింగ్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయన్న వార్తలను కూడా ఆయన ఖండించారు. ఇందులోనూ ఏమాత్రం నిజం లేదంటూ ఫ్లైట్ డేటాను షేర్ చేశారు. ప్రభుత్వ కార్యకలాపాలు సాధారణంగానే సాగుతున్నట్టున్న ఫొటోలను కూడా విడుదల చేశారు. 

జిన్‌పింగ్ చాలా శక్తిమంతమైన నేత అని, ఆయనపై సైనిక చర్య అసాధ్యమని జర్నలిస్ట్ జక్కా జాకోబ్ పేర్కొన్నారు. సైనిక చర్య అంటూ ఉదయం నుంచి బోల్డన్ని వార్తలు వస్తున్నాయని పేర్కొన్న ఆయన.. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సెంట్రల్ మిలటరీ కమిషన్ (సీఎంసీ) పరిధిలోకి వస్తుందని అన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జిన్‌పింగ్ సీఎంసీకి సారథ్యం వహిస్తున్నారని అన్నారు. కాబట్టి ఆయనపై సైనిక చర్య వార్తలకు పసలేదని చెబుతూ ట్వీట్ చేశారు. అలాగే, జర్నలిస్ట్, రచయిత అయిన అనంత్ కృష్ణన్ కూడా సైనిక తిరుగుబాటు వార్తలు నిజం కావని కొట్టిపడేశారు. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లు నిజం కావని స్పష్టం చేశారు. పొరుగునే ఉన్న హాంకాంగ్‌కు చెందిన ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ కూడా సైనిక తిరుగుబాటుకు సంబంధించి ఎలాంటి వార్తలు ప్రచురించలేదు.

More Telugu News