Madhya Pradesh: విద్యార్థిని యూనిఫాం మాసిపోయిందని ఉతికిన ఉపాధ్యాయుడు.. సస్పెండ్ చేసిన అధికారులు!

  • మధ్యప్రదేశ్‌లోని శహడోల్ జిల్లాలో ఘటన
  • మాసిన యూనిఫాంతో స్కూలుకొచ్చిన ఐదో తరగతి బాలిక
  • యూనిఫాం విప్పించి స్వయంగా ఉతికిన ఉపాధ్యాయుడు
  • యూనిఫాం ఆరే వరకు అలాగే నిల్చున్న బాలిక
MP teacher suspended after disrobing girl washing her uniform on school campus

తానొకటి తలస్తే దైవం మరోటి తలచిందని ఇందుకే అంటారు కాబోలు. పరిశుభ్రతపై విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయుడు చిక్కుల్లో పడ్డాడు. ఇప్పడతడి ఉద్యోగానికే ఎసరు వచ్చేలా ఉంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. మధ్యప్రదేశ్‌లోని శహదోల్ జిల్లా జైసింగ్ నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఓ గిరిజన బాలిక ఐదో తరగతి చదువుతోంది. పూర్తిగా మాసిన యూనిఫాంతో స్కూలుకు వచ్చిన బాలికను చూసిన ఉపాధ్యాయుడు శ్రావణ్ కుమార్ త్రిపాఠి.. బాలిక యూనిఫాంను విప్పించి స్వయంగా ఉతికి శుభ్రం చేశాడు. 

అక్కడి వరకు బాగానే ఉన్నా.. యూనిఫాం ఉతికి, అది ఆరేంత వరకు బాలిక అలాగే దుస్తులు లేకుండానే నిల్చుంది. యూనిఫాం ఆరిన తర్వాత తొడుక్కున్నాక కానీ బాలిక తరగతి గదిలోకి వెళ్లలేదు. అక్కడితో ఊరుకున్నా అయిపోయేది. కానీ, ఆ ఉపాధ్యాయుడు తాను యూనిఫాం ఉతుకుతుండగా ఫొటో తీయించి దానిని విద్యాశాఖ గ్రూపులో షేర్ చేశాడు. పరిశుభ్రతకు తాను ప్రాణం ఇస్తానని అందులో రాసుకొచ్చాడు. ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా కలెక్టర్ వందనా వైద్య స్పందించారు. అమ్మాయిని దుస్తులు లేకుండా నిలబెట్టి యూనిఫాం ఉతికిన ఘటనపై విచారణ జరిపించి ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కాగా, ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్టు శహదోల్ ట్రైబల్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆనంద్ రాయ్ సిన్హా ఆ తర్వాత నిర్ధారించారు.

More Telugu News