G Vivek: కేటీఆర్, కల్వకుంట్ల కుటుంబం వల్లే హైదరాబాద్ క్రికెట్ సంఘం భ్రష్టుపట్టింది: వివేక్

  • టీమిండియా, ఆసీస్ మ్యాచ్ కు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం
  • టికెట్ అమ్మకాలు ప్రహసనంగా మారిన వైనం
  • టీ20 మ్యాచ్ టికెట్ విక్రయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న వివేక్  
  • హెచ్ సీఏ అధ్యక్షుడిగా అజారుద్దీన్ విఫలమయ్యాడని విమర్శ 
Vivek alleges Kalvakuntla family caused to HCA downfall

టీమిండియా, ఆసీస్ మూడో టీ20 మ్యాచ్ కు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమిస్తుండగా, మ్యాచ్ టికెట్ల కోసం ఎంతటి ప్రహసనం నెలకొందో అందరికీ తెలిసిందే. టికెట్ల అమ్మకాల విషయంలో తీవ్ర నిర్లక్ష్య వైఖరి కనబర్చిందంటూ హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్ సీఏ)పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆఖరికి ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. 

ఈ నేపథ్యంలో, బీజేపీ నేత, హెచ్ సీఏ మాజీ అధ్యక్షుడు జి.వివేక్ స్పందించారు. కేటీఆర్, కల్వకుంట్ల కుటుంబం వల్లే హెచ్ సీఏ భ్రష్టుపట్టిందని విమర్శించారు. కవితను హెచ్ సీఏ ప్రెసిడెంట్ చేయడానికి సీఎం కేసీఆర్ గేమ్ ఆడి విఫలమయ్యాడని వివేక్ అన్నారు. గతంలో తన ప్యానెల్ ను ఓడించడానికి కేటీఆర్ విఫలయత్నం చేశాడని వెల్లడించారు. 

కూతురు కోసం కేసీఆర్ కూడా రంగంలోకి దిగారని, హెచ్ సీఏ ఎన్నికల్లో నన్ను పోటీ చేయొద్దని గతంలో అన్నారని వివేక్ ఆరోపించారు. టీ20 మ్యాచ్ టికెట్ విక్రయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

హెచ్ సీఏ అధ్యక్షుడిగా అజారుద్దీన్ విఫలమయ్యాడని తెలిపారు. హెచ్ సీఏలో ఇలాంటి గందరగోళం గతంలో ఎప్పుడూ లేదని, తాజా పరిణామాలపై విచారణ జరపాలని అన్నారు.

More Telugu News