Bats: మానవాళి వైపు మరో మహమ్మారి.. కరోనా కన్నా ప్రమాదకరమైన ఖోస్తా–2 వైరస్​ ను గుర్తించినట్టు శాస్త్రవేత్తల వెల్లడి

  • రష్యాలోని ఒక రకం గబ్బిలాల్లో గుర్తించిన అమెరికా పరిశోధకులు 
  • ఈ వైరస్ కు వేగంగా వ్యాపించే లక్షణం ఉన్నట్టు గుర్తింపు
  • ఇది ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు వేటికీ లొంగే అవకాశం లేదని వెల్లడి
Researchers Find Bat Virus Khosta 2 In Russia Says It Could Infect Humans like corona

మానవాళికి మరో వైరస్ మహమ్మారి ముప్పు పొంచి ఉందని.. రష్యాలోని గబ్బిలాల్లో ‘ఖోస్తా–2’ అనే వైరస్ మనుషులకు వ్యాపించే ప్రమాదం ఎక్కువని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ అంశంపై అమెరికాకు చెందిన వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ‘ఖోస్తా–2’ వైరస్ అనేది కరోనా వైరస్ లలో ఉప జాతి అయిన సర్బెకో వైరస్ రకానికి చెందినదని చెబుతున్నారు. ‘పీఎల్ఓఎస్ పాథోజెన్స్’ అనే జర్నల్ లో దీనికి సంబంధించిన వివరాలు ప్రచురితం అయ్యాయి.

పరిశోధనలో తేలిన వివరాలివీ..

  • కరోనా వైరస్ ల కంటే దీటుగా ఖోస్తా–2 వైరస్ మానవ కణాలపై దాడి చేసి.. అందులో సంతతిని పెంచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
  • కరోనా వైరస్ ల తరహాలోనే మానవ కణాల్లోని ఏసీఈ–2 రిసెప్టార్ కు ఈ వైరస్ అతుక్కుని.. కణాల్లో ప్రవేశిస్తుందని తేల్చారు. ఇది కూడా ఊపిరితిత్తులు, శ్వాస వ్యవస్థ, జ్వరం వంటి లక్షణాలను కలిగించగలదని అంచనా వేశారు.
  • కోవిడ్ సోకి తగ్గిన, వ్యాక్సిన్ తీసుకున్నవారి రక్తం నుంచి సీరం (తెల్లని ద్రవం)ను తీసి ఎక్కించిన వారిలో.. మోనో క్లోనల్ యాంటీ బాడీస్ ఇంజెక్షన్లు ఇచ్చినవారిలో కూడా ఖోస్తా–2 వైరస్ ప్రభావం చూపగలదని తేల్చారు.
  • ప్రస్తుతమున్న కోవిడ్, ఇతర వైరస్ లకు సంబంధించిన వ్యాక్సిన్లు ఏవీ కూడా ఈ కొత్త వైరస్ నుంచి రక్షణ కల్పించలేవని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. 
  • ఇప్పుడు కాకున్నా భవిష్యత్తులో ఈ వైరస్ మానవాళికి విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. అందువల్ల సర్బెకో వైరస్ జాతికి సంబంధించి ప్రత్యేక వ్యాక్సిన్ల రూపకల్పనపై దృష్టిసారించాల్సి ఉందని పేర్కొన్నారు.
  • నిజానికి సర్బెకో వైరస్ జాతులకు చెందిన వైరస్ లను ఇంతకు ముందే గుర్తించినా.. ఖోస్తా–2 వాటన్నింటికన్నా భిన్నంగా, ప్రమాదకరంగా ఉందని హెచ్చరించారు. ఒకవేళ కరోనా, ఖోస్తా రెండు వైరస్ లు కలిసిన కొత్త వైరస్ పుడితే మాత్రం ప్రమాదకరంగా మారుతుందని పేర్కొంటున్నారు.

More Telugu News