Moon: అప్పట్లో చంద్రుడిపై నడవడానికి ఆస్ట్రోనాట్లు ఇలా ఇబ్బందిపడ్డారు.. నాసా తాజాగా విడుదల చేసిన వీడియో ఇదిగో!

  • చందమామపై గురుత్వాకర్షణ తక్కువగా ఉండటంతో నడిచేందుకు ఇబ్బందులు
  • ఎగురుతూ వెళుతూ, కింద పడిపోతూ ముందుకు వెళ్లిన ఆస్ట్రోనాట్లు
  • గతంలో దీనికి సంబంధించి చిన్న చిన్న బిట్లుగా వీడియోలు..
  • పాత వీడియోలన్నీ ఒకే వీడియోగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్
How hardships the astronauts faced to walk on the moon Here is the video released by NASA

మానవాళి చరిత్రలో అత్యంత కీలక ఘట్టాల్లో ఒకటి చందమామపై మనిషి అడుగు పెట్టడం. దశాబ్దాల క్రితమే అమెరికా తన అపోలో అంతరిక్ష యాత్రలతో చంద్రుడిపైకి మనుషులను పంపగలిగింది. అపోలో 11 వ్యోమనౌక ద్వారా ఆస్ట్రోనాట్లు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ తొలుత అక్కడ అడుగు పెట్టారు. అయితే చందమామపై గురుత్వాకర్షణ చాలా తక్కువ. వాతావరణం అత్యంత పలుచగా ఉంటుంది. మన శరీరాలు భూమి గురుత్వాకర్షణకు, ఇక్కడి వాతావరణ పీడనానికి తగినట్టుగా ఉంటాయి. దీనితో చందమామపై దిగిన ఆస్ట్రోనాట్లు నడవడానికి చాలా ఇబ్బందిపడ్డారు.

గురుత్వాకర్షణ ఇబ్బందితో..

  • సాధారణంగా ఇక్కడ మనం అడుగు వేసి, తీయడానికి కొంత బలం ప్రయోగిస్తాం. అది భూమి గురుత్వాకర్షణ (గ్రావిటీ)కు అనుగుణంగా ఉంటుంది. కానీ చంద్రుడిపై గురుత్వాకర్షణ తక్కువ కాబట్టి మనం అదే బలంతో కాలు వేస్తే.. రబ్బర్ బంతిలా తిరిగి వెనక్కి ఎగురుతుంది.
  • దీనితో అక్కడికి వెళ్లిన ఆస్ట్రోనాట్లు నడవడానికి ప్రయత్నిస్తూ.. కింద పడిపోయిన దృశ్యాలు నాసా వీడియోలో ఉన్నాయి. ఆస్ట్రోనాట్లు అక్కడి పరిస్థితిని అర్థం చేసుకుని.. కాసేపటికి మెల్లగా ఎగిరి దూకుతూ ముందుకు కదిలారు. ఈ వీడియోలను స్లో మోషన్ లో విడుదల చేశారు. అందులో ఆస్ట్రోనాట్లు పడ్డ ఇబ్బందులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
  • నాసా విడుదల చేసిన ఫుటేజీని మొదట యూనివర్సల్ క్యూరియాసిటీ ఖాతాలో, తర్వాత సాహిల్ బ్లూమ్ పేరిట ఉన్న ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 78 లక్షల మందికిపైగా చూశారు. లక్షల సంఖ్యలో లైకులు, వేలల్లో షేరింగ్‌ లు వచ్చాయి.

బోగస్ అంటూ కొందరు.. ఎంత కష్టమో అంటూ మరికొందరు..
  • అయితే చంద్రుడిపైకి మనుషులను పంపడం అంతా బోగస్ అని, అదంతా ఏదో స్టూడియోలో చిత్రీకరించారని ఉన్న వాదనలు ఈ వీడియోల కింద కామెంట్లుగా కనిపిస్తున్నాయి.
  • కొందరేమో ‘చంద్రుడిపై మనుషులు అబద్ధం అనడం ఏమిటి? చూశారా.. నడవడానికి వారు ఎంత అవస్థ పడుతున్నారో.. ఇలాంటిది అప్పట్లో ఎలా చిత్రీకరిస్తారు?’ అని అంటున్నారు.
  • ‘ఆ మాత్రం గ్రాఫిక్ లా తీయడం పెద్ద కష్టమేమీ కాదు. ఇదంతా ప్లాన్ చేసి తీసిన వీడియోనే..’ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
  • ‘అప్పట్లో నిజంగానే చంద్రుడిపైకి వెళ్లగలిగి ఉంటే.. మరి ఇన్నేళ్ల తర్వాత, ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఎందుకు వెళ్లలేకపోతున్నారు?’ అంటున్నవారూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.

More Telugu News