CM Ramesh: ప్రభుత్వం మారిన వెంటనే మళ్లీ ఎన్టీఆర్ పేరు పెడతాం: సీఎం రమేశ్

  • ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి వైఎస్సార్ పేరు పెట్టిన జగన్ ప్రభుత్వం
  • ఒక్క బిల్డింగ్ కూడా కట్టలేని జగన్ పేర్లు మారుస్తూ పబ్బం గడుపుకుంటున్నారన్న రమేశ్
  • వైసీపీ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించిందని మండిపాటు
Will rename health university as NTR university says CM Ramesh

ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చడంపై బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ మండిపడ్డారు. తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ పేరును తొలగించడం అత్యంత సిగ్గుచేటని అన్నారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించిందని అన్నారు. 

ఎన్టీఆర్ పేరును తొలగించడాన్ని ముఖ్యమంత్రి జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు నిస్సుగ్గుగా సమర్థించుకోవడం దారుణమని చెప్పారు. దేశ, విదేశాల్లో తెలుగువారికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రతి తెలుగువాడిని ఆవేదనకు గురి చేస్తోందని చెప్పారు.

మూడేళ్ల పాలనలో ఒక్క రోడ్డు, భవనం, ప్రాజెక్టును కూడా నిర్మించలేని జగన్ పాత వాటి పేర్లను మారుస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ చర్యలను ప్రతి పౌరుడు ఖండించాలని చెప్పారు. జగన్ ప్రభుత్వానికి గుణపాఠం నేర్పేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరును పెట్టి తీరుతామని చెప్పారు.

More Telugu News