Yarlagadda: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును మార్చడంపై అసంతృప్తి... యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాజీనామా..

  • ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును మార్చడంపై అసంతృప్తి
  • ఎన్టీఆర్ పేరును తొలగించడం సరికాదన్న యార్లగడ్డ
  • టీడీపీ సిద్ధాంతాలను చంద్రబాబు పాటించడం లేదని విమర్శ
Yarlagadda resigns to Adhikara Bhasha Sangham

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును మార్చాలనే ఏపీ ప్రభుత్వ నిర్ణయం రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇదే అంశంపై అసెంబ్లీలో టీడీపీ సభ్యులు రచ్చ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల టీడీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. మరోవైపు, ప్రభుత్వ నిర్ణయంపై సొంత పార్టీలో సైతం కొందరు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 

ఈ క్రమంలో అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాజీనామా చేశారు. దేనికైనా వైఎస్సార్ పేరు పెడితే తనకు అభ్యంతరం లేదని... కానీ, ఎన్టీఆర్ పేరును తొలగించడం సరికాదని ఆయన అన్నారు. ఎన్టీఆర్ పేరును తొలగించడంపై తీవ్ర మనస్తాపానికి గురయ్యానని... అందుకే రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. 

తెలుగుగంగ ప్రాజెక్టుకు 'ఎన్టీఆర్ తెలుగుగంగ ప్రాజెక్టు'గా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ నామకరణం చేశారని గుర్తుచేశారు. అందుకే తనకు వైఎస్సార్ అంటే అంత గౌరవమని అన్నారు. చంద్రబాబుపై తనకు కోపం ఉండటానికి కారణం ఏమిటంటే... టీడీపీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఆయన వెళ్తున్నారని అన్నారు. వైస్రాయ్ హోటల్ ఘటన తర్వాత టీడీపీని నడిపించే శక్తి చంద్రబాబుకే ఉందని తాను ఆనాడే చెప్పానని, ఇప్పుడు కూడా అదే చెపుతున్నానని తెలిపారు. 

అయితే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందని... అలాంటి కాంగ్రెస్ తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ తన వారసులను రాజకీయాల్లోకి తీసుకురాలేదని... కానీ, చంద్రబాబు తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారని అన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చేందుకు అప్పటి ప్రధాని వాజ్ పేయి సిద్ధంగా ఉంటే... చంద్రబాబు వద్దన్నారని తెలిపారు. ఎన్టీఆర్ కు భారతరత్న వస్తే క్రెడిట్ లక్ష్మీపార్వతికి వస్తుందని ఆయన భావించారని చెప్పారు.

More Telugu News