Kakinada: ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్తే.. గర్భిణివే కాదన్నారు!

  • గర్భిణి అని నిర్ధారించి ప్రతి నెల పరీక్షలు
  • శిశువు ఆరోగ్యంగా పెరుగుతోందంటూ ప్రతీ నెలా మందులు
  • డెలివరీ డేట్ కూడా ఇవ్వడంతో పుట్టింటికి వెళ్లిన బాధితురాలు
  • నెలలు నిండడంతో అక్కడి ప్రభుత్వాసుపత్రిలో చూపించిన కుటుంబ సభ్యులు
  • పరీక్షించి గర్భంలో శిశువే లేదన్న ప్రభుత్వ వైద్యులు
  • ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన
Pregnant Woman who went for delivery is shocked

ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్లిన మహిళను పరీక్షించిన వైద్యులు.. 'నువ్వసలు గర్భిణివే కాదు' అనడంతో సదరు మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. కాకినాడలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి చెందిన మహాలక్ష్మికి యానాంకు చెందిన వి.సత్యనారాయణతో వివాహమైంది. 9 నెలల క్రితం మహాలక్ష్మి కాకినాడ గాంధీనగర్‌లోని ఓ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా గర్భిణి అని నిర్ధారించారు. 

అప్పటి నుంచి ఆమె వైద్యుల సూచన మేరకు ప్రతినెలా ఆసుపత్రికి వస్తూ పరీక్షలు చేయించుకుని మందులు వాడేది. ఆసుపత్రికి వచ్చిన ప్రతిసారీ స్కానింగ్ చేసి పొట్టలోని బేబీ ఆరోగ్యంగా ఉందంటూ మందులు రాసిచ్చేవారు. ఈక్రమంలో ఆరో నెలలో మరోమారు ఆసుపత్రికి వచ్చిన మహాలక్ష్మిని పరీక్షించిన వైద్యులు సెప్టెంబరు 22న ప్రసవం అవుతుందని డేట్ కూడా ఇచ్చారు.  
 
గర్భంలో శిశువే లేదన్న అదే ఆసుపత్రి
డెలివరీ డేట్ ఇవ్వడంతో ప్రసవం కోసం మహాలక్ష్మి పుట్టింటికి వెళ్లింది. తాజాగా నెలలు నిండడంతో ఆమె తల్లిదండ్రులు డెలివరీ కోసం కుమార్తెను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ మహాలక్ష్మిని పరీక్షించిన వైద్యులు స్కానింగ్ చేయగా ఆమె అసలు గర్భవతే కాదని తేలింది. దీంతో నిర్ఘాంతపోయిన కుటుంబ సభ్యులు కుమార్తెను తీసుకుని కాకినాడలో ఆమె తొలుత చూపించుకున్న ఆసుపత్రికి వెళ్లారు. అక్కడామెకు స్కానింగ్ తీయగా మహాలక్ష్మి గర్భంలో శిశువు లేదన్న విషయం స్పష్టమైంది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు మహాలక్ష్మిని ప్రతి నెల పరీక్షిస్తున్న వైద్యురాలిని కలిసి ప్రశ్నించారు. ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతోందని..
ఈ సందర్భంగా బాధిత మహిళ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. మహాలక్ష్మి గర్భిణి అని నిర్ధారించి ప్రతి నెలా మందులు రాసిచ్చి వాడమని చెప్పేవారని పేర్కొన్నారు. గర్భంలోని బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతోందంటూ రాసిచ్చిన మందులు వేసుకున్నాక తమ కుమార్తె పొట్ట పెద్దదైందని అన్నారు. పరీక్షలు, మందుల పేరుతో వేలకువేలు దండుకున్నారని ఆరోపించారు. ఇప్పుడసలు ఆమె గర్భిణే కాదంటున్నారంటూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలిసిన మహిళా సంఘాలు బాధిత కుటుంబానికి అండగా నిలిచాయి. అయితే, ఈ ఘటనపై కేసు నమోదైందీ, లేనిదీ తెలియరాలేదు.

More Telugu News