Jagan: గత ప్రభుత్వ హయాంలో ఎలుకలు కొరికి పిల్లలు చనిపోవడం చూశాం: సీఎం జగన్

  • ఏపీలో అమలు చేస్తున్న పథకాలపై అసెంబ్లీలో సీఎం ప్రసంగం
  • తాము అధికారంలోకి వచ్చాక అనేక చర్యలు తీసుకున్నామని వెల్లడి
  • పాఠశాలలకు పునర్ వైభవం కల్పించామన్న జగన్  
  • అమ్మఒడి పథకం ఓ విప్లవాత్మక ముందడుగు అని వ్యాఖ్య 
CM Jagan speech in Assembly

ఏపీలో అమలు చేస్తున్న నాడు-నేడు, విద్యావ్యవస్థ, ఆసుపత్రుల నిర్వహణ తదితర అంశాలపై ఏపీ సీఎం జగన్ నేడు అసెంబ్లీలో ప్రసంగించారు. వైద్య రంగంలోనూ గతంలో ఎన్నడూలేనంత మార్పులు వచ్చాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆసుపత్రుల పరిస్థితి దారుణంగా ఉండేదని, ఎలుకలు కొరికి పిల్లలు చనిపోవడం చూశామని అన్నారు. సెల్ ఫోన్ వెలుతురులో శస్త్రచికిత్సలు చేయడం కూడా చూశామని దెప్పిపొడిచారు.   

అయితే, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాణ్యమైన వైద్యం అందించేందుకు అనేక చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. ప్రతి గ్రామంలో వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నామని, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకువస్తున్నామని తెలిపారు. 

ఆరోగ్యశ్రీలో వైద్య చికిత్సలను 3,118కి పెంచామని వివరించారు. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తున్నామని తెలిపారు. ఏపీలో ఇప్పుడు 90 శాతం మందికి పైగా ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నారని సీఎం జగన్ స్పష్టం చేశారు. 

ఈ మూడేళ్ల వ్యవధిలో వైద్యరంగంలో 45 వేల ఉద్యోగాలు కల్పించామని, రాష్ట్రంలో కొత్తగా 17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. వైద్య కళాశాలల కోసం రూ.12,268 కోట్లు ఖర్చుచేస్తున్నామని వివరించారు.

ప్రపంచంలో విద్యావ్యవస్థలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ఏపీ విద్యారంగంలోనూ అనేక సంస్కరణలు చేపట్టామని వెల్లడించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, గతంలో ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయి? అనేది పరిశీలించాలని అన్నారు. 

మనబడి, నాడు-నేడు ద్వారా 57 వేల పాఠశాలలు, హాస్టళ్ల అభివృద్ధికి రూ.16 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఉన్నత విద్యను హక్కుగా మార్చామని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ స్కూళ్లను గాలికొదిలేశారని, కుప్పంలో పాఠశాలలు దీనావస్థలో ఉండేవని సీఎం జగన్ తెలిపారు. చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలోనూ స్కూళ్లను పట్టించుకోలేదని విమర్శించారు. 

తాము అధికారంలోకి వచ్చాక నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని, ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. గతంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీ అట్టడుగున ఉన్న పరిస్థితి ఉండేదని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పాఠశాలలకు పునర్ వైభవం కల్పించామని అన్నారు. 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్ తో కూడిన ట్యాబ్ లు ఇస్తున్నామని, విద్యా కానుక కింద రూ.886 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు.

విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా విద్యార్థులకు అండగా నిలుస్తామని చెప్పారు. ఇక అమ్మఒడి పథకం ఓ విప్లవాత్మక ముందడుగు అని, దేశంలో ఎక్కడా ఇలాంటి పథకంలేదని సీఎం జగన్ పేర్కొన్నారు. అమ్మఒడి పథకం ద్వారా మూడేళ్లలో 84 లక్షల మంది పిల్లలకు లబ్ది చేకూరిందని వెల్లడించారు. అమ్మఒడి పథకానికి రూ.17 వేల కోట్లకుపైగా ఖర్చు చేశామని వివరించారు. 

అటు, జగనన్న గోరుముద్ద పథకంతో పౌష్టికాహారం అందిస్తున్నామని, గోరుముద్ద పథకానికి ఏడాదికి రూ.1,800 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.

More Telugu News