Bollywood: ఆయుష్మాన్​ ఖురానా.. ఈసారి పురుష గైనకాలజిస్టుగా

  • వైవిధ్యమైన కథలను ఎంచుకునే హీరో ఖురానా
  • అక్టోబర్ 14న విడుదల కానున్న ‘డాక్టర్ జీ’
  • హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్
Ayushmann Khurrana plays a reluctant gynaecology student

బాలీవుడ్ లో యువ హీరో ఆయుష్మాన్ ఖురానాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కెరీర్ ఆరంభం నుంచి అతను వైవిధ్యమైన కథలనే ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఎవ్వరూ ఊహించని, సాహసించని పాత్రలు చేయడం అతని శైలి. ఆయుష్మాన్ నటన కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. ముఖ్యంగా సమాజంలో చిన్నచూపు ఉన్న అంశాల చుట్టూ ఉన్న కథలను ఎంచుకొని, వినోదంతో పాటు సందేశం ఇవ్వడం ఖురానా స్పెషాలిటీ అనొచ్చు. తన తొలి చిత్రం ‘విక్కీ డోనర్’లో స్పెర్మ్ దాతగా నటించి మెప్పించిన అతను ‘దమ్ లగా కే హైసా’, ‘అంధాధున్’, ‘బదాయి హో’, ‘డ్రీమ్ గర్ల్’, ‘బాలా’ వరకూ ప్రతీ చిత్రంలో డిఫరెంట్ పాత్రతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరో ఆసక్తికర చిత్రం, పాత్రతో తను ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఆయుష్మాన్ ఈసారి పురుష గైనకాలజిస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనుభూతి కశ్యప్‌ దర్శకత్వంలో ‘డాక్టర్ జి’ అనే చిత్రంలో అతను వైద్యుడిగా నటిస్తున్నాడు. సాధారణంగా గైనకాలిజస్టులుగా మహిళలే ఉంటారు. కానీ, పురుష గైనకాలజిస్టులుగా నవ్వులతో పాటు తన మార్కు సందేశం ఇచ్చేందుకు ఆయుష్మాన్ రెడీ అయ్యాడు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది. 

ఈ చిత్రాన్ని అక్టోబర్ 14న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ఎంబీబీఎస్ లో చేరిన ఆయుష్మాన్.. ఆర్థోపెడిక్స్ చదవాలనుకుంటాడు. కానీ, తనకు గైనకాలజీ కేటాయించడంతో... మహిళా విద్యార్థులు, ఆపరేషన్ థియేటర్లో తోటి వైద్యులతో ఇబ్బందులతో సరదాగా ట్రైలర్ సాగింది. ఈ చిత్రంతో పాటు తనకెంతో పేరు తెచ్చిన ‘డ్రీమ్‌గాళ్’ సీక్వెల్‌ను కూడా ఆయుష్మాన్ లైన్ లో పెట్టాడు. ఇందులో అనన్యా పాండే హీరోయిన్‌గా ఎంపికైంది.

More Telugu News