Team India: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్​కు ముందు భారత్​కు ఎదురుదెబ్బ.. స్టార్​ ప్లేయర్​కు కరోనా

  • సీనియర్ పేసర్ షమీకి కరోనా
  • అతని స్థానంలో జట్టులోకి ఉమేశ్ 
  • మంగళవారం ఆసీస్ తో తొలి టీ20 
Mohammed Shami tests positive for Covid19

ఆసియా కప్ లో తీవ్రంగా నిరాశ పరిచిన తర్వాత సొంతగడ్డపై  ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కు సిద్ధమవుతున్న భారత జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. మరో రెండు రోజుల్లో సిరీస్ ప్రారంభం అవనుండగా.. కీలక ఆటగాడి సేవలు కోల్పోనుంది. భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కరోనా బారిన పడ్డాడు. దాంతో, అతను మిగతా ఆటగాళ్లతో కలిసి మొహాలీ చేరుకోలేదు. అతని స్థానంలో ఉమేశ్ యాదవ్ ను జట్టులోకి తీసుకున్నారు. గాయం నుంచి కోలుకున్న ఉమేశ్  బెంగళూరులోని ఎన్సీఏలో రిహాబిలిటేషన్ కు హాజరుకావాల్సి ఉంది. కానీ, షమీ స్థానాన్ని భర్తీ చేసేందుకు అతను మొహాలీ చేరుకోనున్నాడు. మంగళవారం మొహాలీలోని పీసీఏ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 జరుగుతుంది. ఇందులో తుది జట్టులో చోటు దక్కితే ఉమేశ్ రెండేళ్ల తర్వాత తిరిగి టీ20 మ్యాచ్ ఆడినట్టు అవుతుంది.

మరోవైపు కొన్నాళ్లుగా పొట్టి ఫార్మాట్ కు షమీని దూరంగా ఉంచిన సెలెక్టర్లు టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకొని, ఆస్ట్రేలియాతో పాటు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ లకు ఎంపిక చేశారు. టీ20 వరల్డ్ కప్ లోనూ షమీని స్టాండ్ బై ప్లేయర్ గా ఎంచుకున్నారు. ఒకవేళ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో టీ20ల్లో సత్తా చాటితే వరల్డ్ కప్ లో ఎవరైనా గాయపడితే షమీని ప్రధాన జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు కరోనా బారిన పడిన షమీ కోలుకునేందుకు కనీసం వారం పట్టే అవకాశం ఉంది. ఈ లెక్కన ఈ నెల 20, 23, 25వ తేదీల్లో జరిగే ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్ లో అతను బరిలోకి దిగేది అనుమానమే.

More Telugu News